ప్రజానవ,వరంగల్: ఆరోగ్య పరిరక్షణలో పోలీస్ క్రీడాకారులు తోటి సిబ్బందికి ఆదర్శంగా నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ సూచించారు.
ఇటీవల మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 తొలి క్లస్టర్ పోటీల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన క్రీడాకారులు మొత్తం 61 పతకాలు సాధించారు. ఈ సందర్భంగా సోమవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పతక విజేతలకు అభినందన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత క్రీడాకారులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ తరఫున ప్రాతినిధ్యం వహించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం గర్వించదగ్గ విషయమని ఆమె పేర్కొన్నారు.
క్రీడాకారులు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ మరింత మెరుగైన విజయాలు సాధించాలని, నిత్యం సాధన చేస్తూ శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని సూచించారు. వారి విజయాలను ఆదర్శంగా తీసుకుని ఇతర పోలీస్ సిబ్బంది కూడా వారానికి మూడు నుంచి నాలుగు రోజులు కొంత సమయం కేటాయించి క్రమశిక్షణతో వ్యాయామం, క్రీడల్లో పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆమె కోరారు.
ఆరోగ్యవంతమైన పోలీసు సిబ్బందే సమర్థవంతమైన సేవలు అందించగలరని పేర్కొన్న సీపీ, క్రీడాస్ఫూర్తి విధి నిర్వహణలోనూ ప్రతిబింబించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు సురేష్ కుమార్, శ్రీనివాస్, బాలస్వామి, ప్రభాకర్ రావు, ఏసీపీ నాగయ్య, ఆర్‌ఐ స్పర్జన్ రాజ్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

