సిరిసిల్ల: సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా నవజాత శిశువుల మరణాల నివారణ, మాతా–శిశు ఆరోగ్య సేవలపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వ–ప్రైవేట్ ఆస్పత్రుల గైనకాలజిస్టులు, చిన్నపిల్లల వైద్య నిపుణులతో బుధవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గత మూడు నెలల్లో నమోదైన నవజాత శిశువుల మరణాలు, వాటి కారణాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, వేములవాడ ఏరియా ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ (SNCU) సేవల పనితీరుపై ఆరా తీశారు.
జిల్లాలో నవజాత శిశువుల మరణాల శాతం జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని పేర్కొన్న కలెక్టర్, మరణాలను పూర్తిగా నివారించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గర్భిణులకు బీపీ, షుగర్, రక్త పరీక్షలు సహా అన్ని వైద్య పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించి, వాటి వివరాలను భద్రపరచాలని సూచించారు.
గర్భిణులకు అవసరమైన వ్యాయామం, యోగా, నార్మల్ డెలివరీ వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించి, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సాధ్యమైనంత ఎక్కువగా సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని తెలిపారు. హైరిస్క్ గర్భిణులకు మాత్రమే సీ-సెక్షన్ ఆపరేషన్లు నిర్వహించాలని స్పష్టం చేశారు.
బాలింతలు పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు ఇవ్వడం, మొదటి గంటలోనే బిడ్డను తల్లి వద్దకు చేర్చడం వంటి అంశాలపై వైద్యులు, సిబ్బంది ప్రత్యేక అవగాహన కల్పించాలని సూచించారు. నెలలు నిండక ముందే లేదా తక్కువ బరువుతో పుట్టిన శిశువులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.
లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టవిరుద్ధమని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హెచ్చరించారు.
సమావేశంలో జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా పంచాయతీ అధికారి జయశీల, డీసీహెచ్‌ఎస్ రవీందర్, మెడికల్ ఆఫీసర్లు, గైనకాలజిస్టులు, చిన్నపిల్లల వైద్య నిపుణులు, ఐఎంఏ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

