Wednesday, July 15, 2026

Buy now

నెన్నెల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ భాస్కర్

మంచిర్యాల: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ నెన్నెల పోలీస్ స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ భాస్కర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన డీసీపీ, రిసెప్షన్ సెంటర్‌లోని సిబ్బందితో మాట్లాడి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో సమావేశమై ఆన్‌లైన్‌లో వివరాల నమోదు, రికార్డుల అప్‌లోడ్ ప్రక్రియపై ఆరా తీశారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలని సూచించారు.

దర్యాప్తులో భాగంగా ప్రతి నేరస్థలాన్ని తప్పనిసరిగా సందర్శించాలని, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ద్వారా ఆధారాలను సేకరించి, **ఈ-సాక్ష్య (E-Sakshya)** అప్లికేషన్‌లో వెంటనే అప్‌డేట్ చేయాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులు, నేరాల రికార్డులను పరిశీలించి, కేసుల దర్యాప్తు పురోగతిపై సీఐ హనోక్, ఎస్‌ఐ రామకృష్ణరావును అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా డీసీపీ ఎగ్గడి భాస్కర్ మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ప్రతి కానిస్టేబుల్ గ్రామ పోలీసు అధికారిగా గ్రామాలను నిరంతరం సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని, సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

అలాగే రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తెలిపారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం రాత్రి పెట్రోలింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డీసీపీ ఎగ్గడి భాస్కర్ పోలీసు సిబ్బందికి సూచించారు.

Related Articles

spot_img

Most Popular