Wednesday, July 15, 2026

Buy now

ఉత్తర తెలంగాణ ఉద్యమకారులతో గుర్తింపు కమిటీ ముఖాముఖి.. సంక్షేమ డిమాండ్లపై చర్చ

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ (జీవో నెం. 679) అధికారిక షెడ్యూల్‌లో భాగంగా అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) వద్ద నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ఉద్యమకారులతో బుధవారం ముఖాముఖి సమావేశం నిర్వహించింది.

కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు, సభ్యుడు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు మోతె శోభన్ రెడ్డి, ఎస్. రాములు నాయక్ తదితరులు పాల్గొని ఉద్యమకారుల అభిప్రాయాలు, సూచనలు, ఉద్యమానికి సంబంధించిన ఆధారాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఉత్తర తెలంగాణ జిల్లాల ఉద్యమకారులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. విద్యార్థులు, ఆర్టీసీ ఉద్యోగులు, సింగరేణి కార్మికులు, గ్రామీణ, పట్టణ ప్రజల భాగస్వామ్యంతో జరిగిన ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావానికి బలమైన పునాదిగా నిలిచిందన్నారు.

సమావేశంలో ఉద్యమకారులు పలు సంక్షేమ డిమాండ్లను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. అర్హులైన ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి 250 గజాల నివాస స్థలం, గౌరవప్రదమైన నెలవారీ జీవితకాల పెన్షన్, ఉద్యమకారుల పిల్లలకు విద్యా, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు, మహిళా ఉద్యమకారులకు ప్రత్యేక స్వయం ఉపాధి అవకాశాలు, డిజిటల్ హెల్త్ కార్డుల ద్వారా ఉచిత వైద్య సేవలు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో జీవితకాల ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు.

ఈ డిమాండ్లన్నింటినీ కమిటీ సానుకూలంగా నమోదు చేసిందని సభ్యులు తెలిపారు. ఉద్యమకారులకు న్యాయం జరిగేలా సమగ్ర నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని హామీ ఇచ్చారు.

జూలై 22 వరకు ఈ ముఖాముఖి సమావేశాలు కొనసాగుతాయని, ఉద్యమకారుల సంక్షేమానికి సంబంధించిన చారిత్రాత్మక నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేస్తామని కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు వెల్లడించారు.

Related Articles

spot_img

Most Popular