* టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ మహమ్మద్ ఒబైదుల్లా కోత్వాల్
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి పెద్దపీట
* 600 మంది మైనారిటీ మహిళలకు రూ.72 లక్షల విలువైన కుట్టు మిషన్ల పంపిణీ
* 60 మంది కాశ ముస్లిం లబ్ధిదారులకు రూ.36 లక్షల సబ్సిడీతో రాతి కటింగ్ యంత్రాలు
* మైనారిటీల సంక్షేమానికి పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక చర్యలు
* పెద్దపల్లిలో మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ మహమ్మద్ ఒబైదుల్లా కోత్వాల్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు
పెద్దపల్లి : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ఆర్థికంగా స్వావలంబన సాధించేలా స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీఎంఎఫ్‌సీ) చైర్మన్ మహమ్మద్ ఒబైదుల్లా కోత్వాల్ అన్నారు.
మంగళవారం పెద్దపల్లిలోని ఎంబీ గార్డెన్స్‌లో ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావుతో కలిసి మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లను,కాశ ముస్లిం లబ్ధిదారులకు రాతి కటింగ్ యంత్రాలు చైర్మన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ మహమ్మద్ ఒబైదుల్లా కోత్వాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముస్లిం మైనారిటీ వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
విద్యావంతులైన మైనారిటీ యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడాలనే ఉద్దేశంతో స్వయం ఉపాధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
రూ.50 వేల వరకు సబ్సిడీ అందించే పథకాల్లో భాగంగా కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నామని, వీటి ద్వారా మహిళలు ఇంటి వద్దే కుట్టు పనులు చేసుకుంటూ ఆదాయం పొందుతూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవవచ్చని అన్నారు. కాశ ముస్లిం కుటుంబాలకు రూ.70 వేల విలువైన రాతి కటింగ్ యంత్రాలను రూ.60 వేల సబ్సిడీతో అందిస్తున్నామని తెలిపారు. ఈ యంత్రాల ద్వారా వారి పనిభారం తగ్గడంతో పాటు ఉపాధి, ఆదాయ అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులే ప్రస్తుతం కూడా పనిచేస్తున్నప్పటికీ ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాల అమలు వేగం గణనీయంగా పెరిగిందన్నారు. గతంలో పెద్దపల్లి జిల్లాలో కేవలం 200 కుట్టు మిషన్లు మాత్రమే పంపిణీ చేయగా, పెద్దపల్లి పట్టణంలో 70 మిషన్లు మాత్రమే పంపిణీ చేశారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఒక్కరోజులోనే 600 మంది మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు.
ప్రజల కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తలకు ప్రజా ప్రభుత్వంలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తోందని ప్రభుత్వ విప్ అన్నారు. అందుకు తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఒబైదుల్లా కోత్వాల్ నియామకం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో కాశ ముస్లిం వర్గాలకు చెందిన 60 మంది లబ్ధిదారులను గుర్తించి, ఒక్కొక్కరికి రూ.60 వేల సబ్సిడీతో 60 రాతి కటింగ్ యంత్రాలను పంపిణీ చేశామని తెలిపారు. వీటి మొత్తం సబ్సిడీ విలువ రూ.36 లక్షలు అని వివరించారు.
అదేవిధంగా 600 మంది మైనారిటీ కుటుంబాలకు ఒక్కొక్కటి రూ.12 వేల విలువైన కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నామని, వీటి మొత్తం విలువ రూ.72 లక్షలు అని తెలిపారు. మైనారిటీల సంక్షేమానికి పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ విప్ తెలిపారు. రాఘవాపూర్ గ్రామంలో మైనారిటీల శ్మశానవాటిక కోసం రెండు ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు ప్రహరీ నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించామని చెప్పారు.
పెద్దపల్లి పట్టణంలో కూడా మైనారిటీల శ్మశానవాటిక కోసం 8 గుంటల విలువైన స్థలాన్ని కేటాయించామని తెలిపారు. పెద్దపల్లిలో షాదీఖానా నిర్మాణానికి కూడా స్థలం కేటాయించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మైనారిటీ కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి పి. నరేష్ కుమార్ నాయుడు, మైనారిటీ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, మైనారిటీ మహిళలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

