* హుజురాబాద్–హనుమకొండ మధ్య సూరారం మీదుగా బస్సు నడిపేందుకు ఆదేశాలు
* సూరారం–పొలాడ్‌పల్లి మధ్య బ్రిడ్జి, రోడ్ల అభివృద్ధికి చర్యలు
* గ్రామంలో రూ.60 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం
* ప్రజా పాలనలో సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి
హనుమకొండ: సూరారం గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో నిర్వహించిన ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల సమక్షంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ ప్రజల నుంచి వ్యక్తిగత, సామాజిక, మౌలిక వసతులకు సంబంధించిన వినతిపత్రాలను స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సూరారానికి సంక్షేమ పథకాలతో భారీగా లబ్ధి
ప్రజా పాలన ప్రభుత్వంలో సూరారం గ్రామానికి వివిధ సంక్షేమ పథకాల ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరిందని మంత్రి తెలిపారు.గ్రామంలో 26 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి.
475 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందుతుండగా, నెలకు రూ.1.11 కోట్లు విడుదలవుతున్నాయి.
గృహజ్యోతి పథకం ద్వారా 665 కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించి రూ.63.96 లక్షల లబ్ధి చేకూరింది.
మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ ద్వారా 535 కుటుంబాలకు రూ.10.08 లక్షలు విడుదలయ్యాయి.
71 స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ.50.92 లక్షలు అందాయి.
71 మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ కింద రూ.10.37 కోట్లు విడుదలయ్యాయి.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు మూడు మహిళా సంఘాల ద్వారా 1,200 స్టీల్ బ్యాంక్ కిట్లు పంపిణీ చేశారు.
340 మంది రైతులకు రూ.2.87 కోట్లు రైతు రుణమాఫీ కింద విడుదలయ్యాయి.
973 మంది రైతులకు రూ.4.83 కోట్లు రైతు భరోసా కింద అందాయి.
8 మంది రైతుల కుటుంబాలకు రైతు బీమా కింద రూ.40 లక్షలు అందించారు.
217 మంది రైతులకు సన్న వడ్ల బోనస్ కింద రూ.62.18 లక్షలు విడుదలయ్యాయి.
47 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, 5 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులు అందించారు.
గ్రామంలో 158 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
గ్రామంలోని 3,380 యూనిట్లకు సన్న బియ్యం పంపిణీ జరుగుతోంది.
మహిళలకు 1,022 ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు.
సూరారం మీదుగా ఆర్టీసీ బస్సు సర్వీస్.
సూరారం గ్రామానికి ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలన్న గ్రామ సర్పంచ్, ప్రజల విజ్ఞప్తిపై మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించారు. హుజురాబాద్–హనుమకొండ మధ్య సూరారం మీదుగా బస్సు నడిపించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. రెండు రోజుల్లో బస్సు సర్వీసును ప్రారంభిస్తామని అధికారులు మంత్రికి తెలిపారు.
బ్రిడ్జి, రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధికి చర్యలు
సూరారం గ్రామంలో విద్యుత్ సరఫరా, తాగునీరు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, కొత్త కాలనీలకు విద్యుత్ స్తంభాలు, అంగన్వాడీ భవనాలు తదితర సమస్యలను గ్రామ సర్పంచ్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. సూరారం–పొలాడ్‌పల్లి మధ్య బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, సూరారం నుంచి వీరనారాయణపూర్ వరకు రోడ్డు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. హైవే నుంచి సూరారం వరకు రహదారి పనులు, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను చేపడతామని చెప్పారు.
జాతీయ రహదారిపై గ్రామ ప్రజల రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తామని, నడుచుకుంటూ వెళ్లే ప్రజల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. గ్రామంలో ఇప్పటివరకు సుమారు రూ.60 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టామని, మిగిలిన అవసరమైన పనులను దశలవారీగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
పెన్షన్లకు ఈ నెల 31 వరకు దరఖాస్తులు
కొత్త పెన్షన్ల కోసం ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బోదకాలు, తలసేమియా, హెచ్ఐవీ బాధితులు తదితర అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆరుతడి పంటల వైపు రైతులు దృష్టి సారించాలి
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయిల్‌పామ్ సాగు వైపు కూడా రైతులు అడుగులు వేయాలని కోరారు.
ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకుని భూగర్భ జలాల పరిరక్షణకు సహకరించాలని, జలసిరి పథకంపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్లాస్టిక్‌కు స్వస్తి.. స్టీల్ బ్యాంక్ వినియోగించాలి
ప్లాస్టిక్ వినియోగం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున గ్రామాల్లో స్టీల్ బ్యాంకులను వినియోగించాలని మంత్రి సూచించారు. సూరారం గ్రామంలో మూడు మహిళా సంఘాలకు 400 చొప్పున మొత్తం 1,200 స్టీల్ బ్యాంక్ కిట్లు అందించామని తెలిపారు. గ్రామంలోని హోటళ్లకు కూడా ఒక్కొక్కరికి 100 స్టీల్ గ్లాసులు అందించినట్లు వెల్లడించారు.
విద్య, క్రీడలకు ప్రాధాన్యత
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యార్థుల సంఖ్యను పెంచాలని మంత్రి సూచించారు. 14–15 సంవత్సరాల వయసున్న బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.
యువత మొబైల్ ఫోన్లకు బానిసలు కాకుండా క్రీడా మైదానాలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. వాలీబాల్, కబడ్డీ తదితర క్రీడల్లో పాల్గొని ప్రతిభను చాటుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో క్రీడలను ప్రోత్సహించేందుకు జాతీయ కబడ్డీ క్రీడాకారుడు కృష్ణను నియమించామని, గ్రామానికి క్రీడా సామగ్రి అందించామని తెలిపారు.
క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికెట్ల ద్వారా భవిష్యత్‌లో ఇండియన్ ఆర్మీ, పోలీస్ శాఖతో పాటు ఇతర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. హుస్నాబాద్ మినీ స్టేడియంలో ఇప్పటికే కబడ్డీ అకాడమీ ఏర్పాటు చేశామని, సూరారం గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ
గతంలో రేషన్ కార్డుల కోసం ప్రజలు సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేదని మంత్రి అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందించే ప్రక్రియను చేపట్టిందని తెలిపారు.
సూరారం గ్రామంలో కొత్తగా 158 రేషన్ కార్డులు పంపిణీ చేయడంతో పాటు 1,230 పేర్లను కొత్తగా చేర్చామని వెల్లడించారు. రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి పైరవీలు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
ఓటు హక్కును కాపాడుకోవాలి
గ్రామంలో సుమారు 500 ఓట్లు తటస్థంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగిపోకుండా చూసుకోవాలని సూచించారు.
తన ఓటుకు కూడా తటస్థ ఓటు నోటీసు వచ్చిందని, తన తండ్రి పేరు ‘సత్తయ్య’కు బదులుగా ‘సత్యనారాయణ’గా నమోదైందని మంత్రి తెలిపారు. ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని సూచించారు.
గ్రామంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో గురవయ్య, జిల్లా, మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచ్ భాషబోయిన నీల–కొమురయ్య, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

