* విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి
* విద్యార్థి మండలి సభ్యులకు బాధ్యతలు అప్పగించిన కలెక్టర్, ఎమ్మెల్యే
మంచిర్యాల: విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానం, సమాజం పట్ల సేవాభావాన్ని పెంపొందించుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూచించారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ గుడిపేటలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన విద్యార్థి మండలి పదవీ స్వీకారోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన విద్యార్థి మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి, వారికి బాధ్యతలను అప్పగించారు. విద్యార్థి నాయకత్వం ద్వారా పాఠశాల స్థాయిలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు, భవిష్యత్లో సమాజానికి సేవ చేసే నాయకులుగా ఎదగాలని కలెక్టర్, ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
విద్యార్థి మండలి ద్వారా పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం, పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావడం, తోటి విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవడం వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
విద్యార్థులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని నూతనంగా ఎన్నికైన విద్యార్థి మండలి సభ్యులకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నాయకత్వ ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని కలెక్టర్, ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

