* పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
* అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు
* ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలి
* అభ్యంతరాలు, దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి
* శాంతి నగర్ లో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్
పెద్దపల్లి బ్యూరో : ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పట్టణంలోని 2 వ వార్డ్ శాంతినగర్లో జరుగుతున్న ఎస్ఐఆర్ (ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ) కార్యక్రమాన్ని శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో చేపడుతున్న ఓటర్ల వివరాల పరిశీలన, మ్యాపింగ్, దరఖాస్తుల స్వీకరణ తదితర ప్రక్రియలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, అందుబాటులో ఉన్న రికార్డులతో సరిపోల్చి నమోదు చేయాలని తెలిపారు.
ఓటర్ల పేరు, చిరునామా, వయస్సు, కుటుంబ వివరాలు తదితర అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఒకే వ్యక్తికి బహుళ ప్రాంతాల్లో ఓటు ఉన్నట్లు గుర్తించిన సందర్భాల్లో నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో నిర్ధారణ చేయాలని ఆదేశించారు. బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించే సమయంలో ప్రజలకు ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని, అర్హత కలిగిన ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకునేలా సహకరించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు, అభ్యంతరాలను స్వీకరించి, వాటిని నిర్ణీత గడువులోగా నిబంధనల ప్రకారం పరిష్కరించాలని ఆదేశించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి వివరాలను పలుమార్లు పరిశీలించిన తర్వాతే నమోదు, ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా బీఎల్ఓలు, సూపర్వైజర్లు, సంబంధిత ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని ఆదేశించారు.
ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో నిర్దేశించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని, ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గంగయ్య , తహసిల్దార్ రాజయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, బీఎల్ఓలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

