Friday, September 4, 2026

Buy now

స్వచ్ఛ ఆటో కార్మికుల పొట్టకొడితే ఊరుకోం: కల్వకుంట్ల కవిత

* రాంకీకి చెత్త సేకరణ కాంట్రాక్టు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌

హైదరాబాద్‌: స్వచ్ఛ ఆటో కార్మికుల ఉపాధికి భంగం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తే తెలంగాణ రక్షణ సేన చూస్తూ ఊరుకోదని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో స్వచ్ఛ ఆటో కార్మికులతో ఆమె సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను కవిత దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం రాంకీ సంస్థకు చెత్త సేకరణ బాధ్యతలు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని, చెత్త ఛార్జీలను ప్రాపర్టీ ట్యాక్స్‌లో కలిపి వసూలు చేస్తే తమ ఉపాధి దెబ్బతింటుందని వివరించారు.

కవిత మాట్లాడుతూ.. రాంకీ సంస్థకు లాభం చేకూర్చేందుకు స్వచ్ఛ ఆటో కార్మికుల ఉపాధిని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వంపై ఎలాంటి భారం లేకుండా స్వయం ఉపాధి పొందుతున్న కార్మికులను ప్రైవేట్‌ సంస్థకు జీతగాళ్లుగా మార్చడం సరికాదన్నారు. ప్రస్తుతం స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందుతున్న వారికి నెలకు రూ.16 వేల జీతం మాత్రమే ఇచ్చే ప్రతిపాదన అన్యాయమని పేర్కొన్నారు.

చెత్త పైసలపై ముఖ్యమంత్రి కన్ను పడింది:
హైదరాబాద్‌లో సుమారు 20 వేల ఆటోల ద్వారా 40 వేల మంది స్వచ్ఛ ఆటో కార్మికులు ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తూ ఉపాధి పొందుతున్నారని కవిత తెలిపారు. ప్రభుత్వంపై భారం లేకుండా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికుల ఉపాధిని దెబ్బతీయడం తగదన్నారు.

చెత్త సేకరణకు ప్రజల నుంచి వసూలు చేసే ఛార్జీలను ప్రాపర్టీ ట్యాక్స్‌లో కలిపే ప్రతిపాదనతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చెత్త సేకరణ బాధ్యతలను రాంకీ సంస్థకు అప్పగించే ప్రయత్నాలను విరమించుకుని, యథావిధిగా స్వచ్ఛ ఆటో కార్మికులతోనే చెత్త సేకరణ కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

సీఎం ఇంటి ముందు వెయ్యి ఆటోల చెత్త పోస్తాం:
స్వచ్ఛ ఆటో కార్మికులకు అన్యాయం జరిగితే తెలంగాణ రక్షణ సేన ఊరుకోదని కవిత హెచ్చరించారు. కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని, వారి పక్షాన తాము పోరాడతామని హామీ ఇచ్చారు. రాంకీ సంస్థకు చెత్త సేకరణ కాంట్రాక్టు ఇచ్చే ప్రతిపాదనను వెనక్కి తీసుకోకపోతే ముఖ్యమంత్రి ఇంటి ముందు వెయ్యి ఆటోలతో చెత్త పోస్తామని హెచ్చరించారు.

స్వచ్ఛ ఆటో కార్మికులు సైనికులతో సమానం:
ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వయం ఉపాధి పొందుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న స్వచ్ఛ ఆటో కార్మికులు సైనికులతో సమానమని కవిత అన్నారు. దేశాన్ని రక్షించే సైనికులకు ఇచ్చే గౌరవం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే కార్మికులకు కూడా ఇవ్వాలని సూచించారు.

స్వచ్ఛ ఆటో కార్మికులకు ప్రభుత్వం రూ.20 లక్షల ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, రాంకీ సంస్థ నిర్వహిస్తున్న డంపింగ్‌ యార్డ్‌ వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ అంశంపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని కోరారు.ఈ సమావేశంలో స్వచ్ఛ ఆటో కార్మికులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular