Friday, September 4, 2026

Buy now

ఇతర పార్టీల నాయకులతో నిండిన బీఆర్ఎస్.. కాంగ్రెస్‌ను ‘పచ్చ కాంగ్రెస్’ అనడం హాస్యాస్పదం

* మంత్రి సీతక్క

ములుగు:ఇతర రాజకీయ పార్టీల నుంచి నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకున్న బీఆర్ఎస్‌ ‘నానాజాతి సమితి’గా మారిందని, అలాంటి పార్టీ కాంగ్రెస్‌ను ‘పచ్చ కాంగ్రెస్’ అంటూ విమర్శించడం హాస్యాస్పదమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క విమర్శించారు. బీఆర్ఎస్‌లో టీడీపీ సహా ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఉన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు.

గురువారం ములుగు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సీతక్క బీఆర్ఎస్, బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇతర పార్టీల నాయకుల గురించి మాట్లాడే ముందు కేటీఆర్‌ తన పార్టీ చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోవాలని అన్నారు. బీఆర్ఎస్‌లోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఉంటే వారు పవిత్రులు, మరో పార్టీలో చేరితే అనైతికులా అని ప్రశ్నించారు.

కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ఏ పార్టీ నుంచి ప్రారంభమైందో కేటీఆర్ గుర్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లోకి వచ్చిన నాయకులు ఎంతమంది ఉన్నారో ప్రజలకు తెలుసన్నారు. మీ పార్టీలో టీడీపీ నుంచి వచ్చిన నాయకులు ఉన్నప్పుడు బీఆర్ఎస్‌ను కూడా ‘పచ్చ పార్టీ’ అనాలా అని ప్రశ్నించారు.

ప్రజలకు మేలు జరుగుతుంటే ఓర్వలేక విమర్శలు
రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతుంటే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఓర్వలేక నిరసనల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని సీతక్క విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు ఏం చేశారో లెక్కలతో చెప్పే ధైర్యం ఆ పార్టీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. పేదల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేదలకు లక్ష ఇళ్లు కూడా ఇవ్వలేకపోయారని, ప్రజా ప్రభుత్వం తొలి దశలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిందని చెప్పారు.

రైతులు, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
రైతులకు సన్నవడ్లకు బోనస్ అందిస్తూ, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి అదే సన్నబియ్యాన్ని పేద కుటుంబాలకు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. పేదవాడు కడుపునిండా అన్నం తింటుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.

సామాన్య కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో కరెంట్ బిల్లులు చెల్లించలేకపోతే పేదల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసిన రోజులను ప్రజలు మర్చిపోలేదన్నారు.దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఉచిత ఎరువులు, దళిత-గిరిజన కుటుంబాలకు మూడెకరాల భూమి, ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తామని బీఆర్ఎస్ హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీల్లో ఎన్ని నెరవేర్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం
పల్లెల్లో తిరిగి చూస్తే బీఆర్ఎస్ పదేళ్ల పాలనకు, ప్రజా ప్రభుత్వ పాలనకు మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుందని సీతక్క అన్నారు. ప్రతిపక్షంగా ఉండటం అంటే ప్రభుత్వం చేసే ప్రతి పనిని అడ్డుకోవడం కాదని, ప్రజలకు మేలు జరిగే అంశాల్లో నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని సూచించారు.

నియోజకవర్గాల అభివృద్ధిపై బీఆర్ఎస్ నేతలతో బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మండలాల వారీగా లబ్ధిదారుల జాబితాలతో రైతు రుణమాఫీ, పంట బోనస్, సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై చర్చకు రావాలని సవాల్ చేశారు.

“మేం రైతు రుణమాఫీ చేశాం. సన్నవడ్లకు బోనస్ ఇచ్చాం. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాం. మహిళలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. చేసిన ప్రతి పనికి లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు పదేళ్లలో ఏం చేశారో లెక్కలతో చెప్పండి” అని సీతక్క సవాల్ విసిరారు.

కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి:
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో ఆ పార్టీ నేతలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఎందుకు సహకరించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు కేంద్రం తెలంగాణకు చేసిన మేలును వివరించాలని సూచించారు.

వ్యక్తిగత దూషణలు, కించపరిచే పోస్టర్లను సహించేది లేదు:
అనవసరమైన చిల్లర రాజకీయాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని బీఆర్ఎస్, బీజేపీ నేతలను సీతక్క హెచ్చరించారు. రాజకీయాలు హుందాగా, గౌరవప్రదంగా ఉండాలని అన్నారు.తమ నాయకులు, ప్రజాప్రతినిధులను వ్యక్తిగతంగా దూషిస్తూ, కించపరిచేలా పోస్టర్లు ఏర్పాటు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

“మా కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దు. మేము సహనంతో ఉన్నామని చేతకానితనంగా భావించవద్దు. మా కార్యకర్తలు సహనం కోల్పోతే నష్టం మీకే జరుగుతుంది. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని పాడు చేయాలని చూస్తే ప్రజాస్వామ్యబద్ధంగానే గట్టిగా సమాధానం చెబుతాం” అని మంత్రి సీతక్క హెచ్చరించారు.

Related Articles

spot_img

Most Popular