- ఎన్నికలు అయిపోగానే పెట్రో ధరల పెంపు
- కర్నాటకలో రూ.3 నుంచి రూ.3.05 పైసల పెంపు
ఎన్నికలు అయిపోగానే కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రో ధరలు పెంచి వాహనదారులకు షాకిచ్చింది. శనివారం పెట్రోల్, డీజిల్ ధరలను రూ.3 నుంచి రూ.3.05 పైసలు పెంచుతున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పెరిగిన ధరలు సైతం తక్షణమే అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో పెరిగిన ధరల ప్రకారం బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.102.86 కాగా, డీజిల్ ధర రూ.88.94కు చేరింది.
ఇదిలాఉంటే గత ఎన్నికల్లో ఇచ్చిన ఐదు హామీల కోసం ప్రతి ఏడాది రూ.50వేల కోట్ల నుంచి 60వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని, పెట్రో ధరల పెంపుతో రూ.2500 కోట్ల నుంచి రూ.2800 కోట్ల వరకు సమీకరించవచ్చని ఆర్థిక శాఖ భావిస్తోంది.
కాంగ్రెస్ ఎన్నికలు అయిపోగానే పెట్రో ధరలు పెంచడంపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచాక కాంగ్రెస్ పార్టీ మాటమార్చిందని, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ప్రతిపక్షాలు సైతం ఆరోపణలు గుప్పిస్తున్నాయి.