Friday, July 17, 2026

Buy now

అంగన్‌వాడీ కేంద్రాల్లో వెలుగులు నింపుతున్న ప్రభుత్వం.. ఆరు నెలల్లో 9,800 కేంద్రాలకు విద్యుత్

హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. ఆమె చొరవతో గత ఆరు నెలల్లోనే 9,800 అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్తగా విద్యుత్ కనెక్షన్లు అందించినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో మొత్తం 35,781 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం 32,109 కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని మంత్రి తెలిపారు. దాదాపు 90 శాతం కేంద్రాలు విద్యుదీకరణ పూర్తిచేసుకున్నాయని, మిగిలిన కేంద్రాలకు కూడా త్వరలో విద్యుత్ సౌకర్యం కల్పించి నూరు శాతం లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొన్నారు.

గతంలో సుమారు 40 శాతం అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ లేకపోవడంతో చిన్నారులు, అంగన్‌వాడీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఫ్యాన్లు, లైట్లు లేకపోవడం వల్ల వేసవిలో చిన్నారులను కేంద్రాల్లో ఉంచడం కష్టంగా మారడంతో పాటు, డిజిటల్ బోధన కూడా విద్యుత్ లేమితో ప్రభావితమైందని వివరించారు.

ఈ పరిస్థితిని గుర్తించి అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా ప్రభుత్వ విద్యాసంస్థల మాదిరిగానే ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు.

విద్యుత్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల మధ్య సమన్వయంతో పెండింగ్‌లో ఉన్న కనెక్షన్లను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. మొత్తం 11,194 కేంద్రాలకు కొత్తగా విద్యుత్ సదుపాయం కల్పించగా, అందులో గత ఆరు నెలల్లోనే 9,800 కేంద్రాలు విద్యుత్ వెలుగులు పొందాయని వెల్లడించారు.

చిన్నారులు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎదగడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే మిగిలిన కేంద్రాలకు కూడా విద్యుత్ సౌకర్యం కల్పించి నూరు శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని సాధిస్తామని స్పష్టం చేశారు.

అంగన్‌వాడీ కేంద్రాల విద్యుదీకరణపై స్పందించిన మంత్రి సీతక్క, గత ప్రభుత్వం “బంగారు తెలంగాణ” పేరుతో ప్రచారం చేసినప్పటికీ వేలాది అంగన్‌వాడీ కేంద్రాలకు కనీస విద్యుత్ సౌకర్యం కల్పించలేదని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం చిన్నారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అంగన్‌వాడీ కేంద్రాల్లో చీకట్లు తొలగిస్తూ మౌలిక వసతులను మెరుగుపరుస్తోందని తెలిపారు.

Related Articles

spot_img

Most Popular