రాజన్న సిరిసిల్ల: రోడ్డు ప్రమాదాల నివారణలో వాహనదారులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పిలుపునిచ్చారు. గురువారం బోయినపల్లి మండలం కోదురుపాక చౌరస్తాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్ ప్రాంతాన్ని వేములవాడ రూరల్ సీఐ, బోయినపల్లి ఎస్ఐలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రమాదాలకు దారితీసే కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని రోడ్డు ప్రమాదాలను సమర్థవంతంగా అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రమాదకర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు నిర్మించడం, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయడం, రోడ్డు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ తప్పనిసరిగా వినియోగించి సురక్షిత ప్రయాణాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు.
అనంతరం మిడ్ మానేర్ డ్యామ్‌ను సందర్శించిన ఎస్పీ, సంబంధిత ఇంజనీర్లతో డ్యామ్ భద్రత, తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రమాకాంత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

