Friday, July 17, 2026

Buy now

గురుకుల విద్యార్థుల సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

గురువారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TGSWREIS) ఆధ్వర్యంలోని చైతన్యపురి మహిళా న్యాయ కళాశాల, ఇబ్రహీంపట్నం రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల (RDC), సరూర్‌నగర్ బాలికల గురుకుల పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

విద్యార్థినులతో ముఖాముఖిగా మాట్లాడిన మంత్రి, విద్యాభ్యాసం, హాస్టల్ నిర్వహణ, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత, బోధన తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. మూడు విద్యాసంస్థలు ఒకే ప్రాంగణంలో ఉండటంతో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థినులు వివరించగా, వెంటనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి మిషన్ భగీరథ పైప్‌లైన్ ద్వారా శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాలని, అప్పటి వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

అనంతరం హాస్టల్ గదులు, డైనింగ్ హాల్, వంటశాల, తరగతి గదులు, గ్రంథాలయం, ప్రయోగశాలలు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణను మంత్రి పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత, మెనూ అమలుపై ఆరా తీయగా, మెనూ ప్రకారమే నాణ్యమైన భోజనం అందుతున్నట్లు విద్యార్థినులు తెలిపారు.

విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడిన మంత్రి, ఏ చిన్న సమస్య ఉన్నా నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల అభిప్రాయాలు, సూచనలు ప్రభుత్వానికి ఎంతో విలువైనవని పేర్కొన్నారు.

ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకమని, తల్లిదండ్రుల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల ఉన్నత విద్యాభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యాసంస్థల నిర్మాణంతో పాటు విద్యార్థుల సంక్షేమం కోసం డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను గణనీయంగా పెంచి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టిందన్నారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపిన విద్యా మార్గంలోనే ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్న మంత్రి, గురుకుల విద్యాసంస్థలు సామాజిక మార్పుకు కేంద్రాలుగా నిలవాలని, ప్రతి ఉపాధ్యాయుడు సేవాభావంతో విద్యార్థులను ఉన్నత లక్ష్యాల వైపు నడిపించాలని పిలుపునిచ్చారు.

విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశంపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని, సమస్యలు గుర్తించిన వెంటనే పరిష్కార చర్యలు చేపట్టి గురుకులాలను దేశంలోనే ఆదర్శ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.

ఈ తనిఖీల్లో టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ (FAC) కార్యదర్శి కంభంపాటి శారద, స్టేట్ ఆఫీసర్ నిర్మల, సరూర్‌నగర్ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణప్రభ, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular