Friday, July 17, 2026

Buy now

వెంకటాపూర్‌లో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఉచిత వైద్య శిబిరం

మంచిర్యాల: రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జోన్ కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మెడీలైఫ్ హాస్పిటల్, సన్‌రైజ్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గ్రామ మహిళలు సీపీ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్‌లకు తిలకం దిద్ది, తలపాగా చుట్టి, పూలమాలలతో సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం గిరిజన సాంస్కృతిక నృత్యాలు, సంప్రదాయ వాయిద్యాల నడుమ వారిని కార్యక్రమ వేదికకు తీసుకువచ్చారు.

సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో కూడా విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడటం ఆనందదాయకమని అన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని, ప్రజలు ఐక్యంగా ఉంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా జీవించే పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు.

మహిళా సంఘాలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలోపేతం కావడం అభినందనీయమని పేర్కొన్న సీపీ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలు వ్యక్తి, కుటుంబం, సమాజాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించారు.

అలాగే ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారే వాహనాలు నడపాలని, మైనర్‌లకు వాహనాలు ఇవ్వకూడదని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు.

ఈ ఉచిత వైద్య శిబిరంలో జనరల్ ఫిజీషియన్, పల్మనాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, రేడియాలజీ, ఆప్తాల్మాలజీ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు సేవలందించారు. రక్తపోటు, రక్తంలో చక్కెర (GRBS), ఈసీజీ, ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష (PFT), 2డీ ఎకో, అల్ట్రాసౌండ్, కంటి పరీక్షలను ఉచితంగా నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు.

దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధితో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీపీ కోరారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, గ్రామస్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, మందమర్రి సీఐ పి. రమేష్, దేవాపూర్ ఎస్‌ఐ గంగారం, కాసిపేట ఎస్‌ఐ ఆంజనేయులు, మందమర్రి ఎస్‌ఐ నరేష్, రామకృష్ణాపూర్ ఎస్‌ఐ శ్రీధర్, మెడీలైఫ్, సన్‌రైజ్ హాస్పిటల్స్ వైద్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular