Thursday, July 16, 2026

Buy now

గోల్కొండలో తొలి బోనంతో ఆషాడ బోనాల ఉత్సవాలకు శ్రీకారం

హైదరాబాద్: గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఆషాడ బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఉత్సవ వేదికకు చేరుకున్న మంత్రులకు ఆలయ అర్చకులు మంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, సాంస్కృతిక కళాకారుల ప్రదర్శనల మధ్య తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక శాఖ రూపొందించిన ఆషాడ బోనాల ఉత్సవాల బుక్‌లెట్‌ను మంత్రులు ఆవిష్కరించారు. అలాగే గోల్కొండ జగదాంబిక ఆలయ కమిటీకి ప్రభుత్వం తరఫున రూ.11 లక్షల చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆశీస్సులతో ఎల్‌నినో ప్రభావం తగ్గి, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, తెలంగాణ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకుని పనిచేస్తోందని తెలిపారు.

బోనాల ఉత్సవాల సందర్భంగా పెద్ద దేవాలయాలతో పాటు చిన్న దేవాలయాలకు కూడా ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని మంత్రి వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సకల ఏర్పాట్లు చేసి, అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకునేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, గోల్కొండ జగదాంబిక ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular