* SIR ప్రక్రియపై ఈసీఐకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
* అభ్యంతరాలు, ఫిర్యాదుల గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని విజ్ఞప్తి
* ఓటర్లకు సహాయ కేంద్రాలు, వికేంద్రీకృత విచారణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచన
హైదరాబాద్: తెలంగాణలో 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు తొలగిపోకూడదని, అదే సమయంలో అనర్హులైన ఎవరూ ఓటర్ల జాబితాలో చేరకూడదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం (ECI) ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు సీఎం లేఖ రాశారు.
SIR ప్రక్రియలో ఓటర్లకు తగిన సమయం, అవసరమైన సహాయం అందించేలా విధానపరమైన భద్రతా చర్యలు చేపట్టాలని, అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించే గడువును పొడిగించాలని ముఖ్యమంత్రి కోరారు.
92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు అవసరం
ఈసీఐ గణాంకాలను ఉటంకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు. 2026 జూన్ 10 నాటికి రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 73.39 లక్షల మందిని (21.7 శాతం) గైర్హాజరైన, నివాసం మారిన, మరణించిన, ఒకటికి మించి నమోదైన ఓటర్లుగా (ASDD) గుర్తించినట్లు తెలిపారు.
ఈ వర్గంలో దాదాపు 62 శాతం అంటే 45.19 లక్షల మందిని శాశ్వతంగా నివాసం మారిన వారిగా గుర్తించడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
మరోవైపు డిజిటలైజ్ చేసిన 2.65 కోట్ల గణన పత్రాల్లో 60.50 లక్షల పత్రాల్లో లోపాలు ఉన్నాయని, మరో 32.36 లక్షల పత్రాలకు గత ఓటర్ల జాబితాతో అనుసంధానం కాలేదని తెలిపారు. దీంతో సుమారు 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది రాష్ట్రంలోని దాదాపు మూడో వంతు ఓటర్లను ప్రభావితం చేసే అంశమని ఈసీఐ దృష్టికి తీసుకెళ్లారు.
తాత్కాలికంగా ఇంట్లో లేనివారిని, శాశ్వతంగా వలస వెళ్లినవారిని వేరు చేయాలి
ప్రస్తుత సవరణ విధానంలో కొన్ని కీలక లోపాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. గణన సిబ్బంది పరిశీలనకు వచ్చిన సమయంలో తాత్కాలికంగా ఇళ్లలో లేని వారిని, శాశ్వతంగా నివాసం మార్చిన వారిని ఒకే విధంగా పరిగణించడం సరికాదన్నారు.
నిజంగా నివాసం మారిన వారికి కొత్త ప్రాంతంలో ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం-6 ద్వారా తగిన సహాయం అందించకుండానే పాత నివాసంలోని ఓటును తొలగించే పరిస్థితి ఉందని తెలిపారు. నివాసం మారిన వారి పేర్లను తొలగించే ముందు అధికారిక నోటీసు ప్రక్రియను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఓటర్లు పోలింగ్ రోజున కేంద్రానికి వెళ్లే వరకు తమ ఓటు హక్కు తొలగిపోయిన విషయం తెలుసుకోలేని ప్రమాదం ఉందని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
మూడు జిల్లాల్లోనే 58.6 శాతం ASDD కేసులు
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే రాష్ట్రంలోని మొత్తం ASDD ఓటర్లలో 58.6 శాతం, పరిశీలన నోటీసుల్లో 41.9 శాతం కేంద్రీకృతమై ఉన్నాయని సీఎం తెలిపారు.ఉద్యోగాలు, వివాహాలు, తాత్కాలిక నివాస మార్పుల కారణంగా పట్టణ ప్రాంతాల్లో అనేక మంది ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున సవరణ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని సూచించారు.
SIR గడువు మరో నాలుగు వారాలు పొడిగించాలి
సమీప భవిష్యత్తులో తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు లేవని, అందువల్ల ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సమగ్రంగా నిర్వహించేందుకు తగిన సమయం ఉందని సీఎం తెలిపారు.ప్రస్తుతం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉన్న అభ్యంతరాలు, ఫిర్యాదుల గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని, తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేదీని అక్టోబర్ 19 నుంచి సవరించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
గ్రామసభలు, వార్డు సమావేశాలతో అవగాహన
గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ముందుగానే విస్తృత ప్రచారం నిర్వహించాలని సీఎం సూచించారు. కనీసం రెండుసార్లు గ్రామసభలు, వార్డు కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి ముసాయిదా ఓటర్ల జాబితాలను బహిరంగంగా చదివి వినిపించాలని విజ్ఞప్తి చేశారు.
నోటీసులు అందుకున్న రోజువారీ కూలీలు, వలస కార్మికులు, వయోవృద్ధులు తమ పత్రాలను సమర్పించేందుకు వారం రోజుల సమయం సరిపోదని, కనీసం మూడు నుంచి నాలుగు వారాల సమయం ఇవ్వాలని కోరారు.ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నియోజకవర్గ, పోలింగ్ కేంద్ర స్థాయిలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఓటర్లకు అవసరమైన పత్రాలపై అవగాహన కల్పించడంతో పాటు వాటిని పొందేందుకు సహకరించాలని సూచించారు.
ఆధారాల జాబితాను విస్తరించాలి
ప్రభుత్వ ఉత్తర్వు (జీవో నంబర్ 172) ప్రకారం జారీ చేసే కుటుంబ నమోదు ధ్రువపత్రాన్ని అంగీకరించకపోవడం వల్ల పట్టణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని సీఎం తెలిపారు.మండల స్థాయిలో సులభంగా లభించే ఇతర పత్రాలను కూడా అంగీకరించేలా ఆధారాల జాబితాను సవరించి విస్తరించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
హైదరాబాద్లో వికేంద్రీకృత విచారణ కేంద్రాలు
హైదరాబాద్లోని ప్రతి నియోజకవర్గంలో సగటున 78 వేలకుపైగా కేసులు ఉన్నందున కేవలం కొంతమంది అధికారుల నియామకం సరిపోదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.ఓటర్ల నమోదు అధికారి స్థాయికి దిగువన అదనపు అధికారులను నియమించాలని, ముద్రిత నోటీసుల్లోనే నిర్దిష్ట తేదీలు, సమయాలను పేర్కొంటూ వికేంద్రీకృత విచారణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.
అర్హత ఉన్న ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా చర్యలు
SIR ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అర్హత ఉన్న ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ కేంద్రాల ఏర్పాటు, గ్రామసభల నిర్వహణతో పాటు పరిపాలనా, ఇతర అవసరమైన సహకారాన్ని పూర్తిస్థాయిలో అందించేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో స్పష్టం చేశారు.

