* పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
* 20 రోజుల్లో ప్రతి ఏఈఓ 15 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు కృషి చేయాలి
* తగ్గుతున్న భూగర్భ జలాల దృష్ట్యా రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు చైతన్యపరచాలి
* ప్రతి క్లస్టర్‌లో మహిళా శక్తి కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
* ఆయిల్ పామ్ సాగు, పంటల ప్రణాళికపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష
పెద్దపల్లి : జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని వేగంగా పెంచడంతో పాటు నీటి లభ్యతకు అనుగుణంగా రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లించేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ, పంటల ప్రణాళికపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా జిల్లాలో సాగు చేసిన ఆయిల్ పామ్ తోటలు ప్రస్తుతం దిగుబడులు ఇవ్వడం ప్రారంభించాయని, రైతులకు సకాలంలో చెల్లింపులు జరుగుతుండటంతో ఇతర రైతుల్లో కూడా ఈ పంటపై ఆసక్తి పెరుగుతోందన్నారు. గత 45 రోజుల్లోనే సుమారు 300 ఎకరాల్లో ఆయిల్ పామ్ నాట్లు పూర్తయ్యాయని, రైతుల ఆసక్తి మరింత పెరిగిన నేపథ్యంలో చిన్నపాటి ప్రోత్సాహం కల్పిస్తే జిల్లాకు నిర్దేశించిన 1,100 ఎకరాల లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చని తెలిపారు. ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) వచ్చే 20 రోజుల్లో కనీసం 15 ఎకరాలను ఆయిల్ పామ్ సాగుకు మార్చేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి క్లస్టర్‌లో ఈ నెలాఖరులోగా కనీసం 15 ఎకరాల్లో ఆయిల్ పామ్ నాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఒకే ప్రాంతంలో 30 నుంచి 40 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు జరిగితే అవసరమైన బోర్‌వెల్లు, ప్రత్యేక విద్యుత్ లైన్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. పెద్ద ఎత్తున సాగు జరిగే ప్రాంతాల్లో విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలాలు సుమారు ఒకటిన్నర మీటరు మేర తగ్గడం ఆందోళన కలిగించే అంశమన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాలు, చెక్‌డ్యామ్‌లు నిండితేనే దిగువ ప్రాంతాలకు నీటి లభ్యత ఉంటుందని, ప్రస్తుతం పరిస్థితులు అత్యంత క్లిష్టంగా ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని 90 శాతం చెరువుల్లో 50 శాతం కన్నా తక్కువ నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని, రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలు సాగు చేసేలా నిరంతరం చైతన్యం కల్పించాలని ఆదేశించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు, విత్తన విక్రేతలు, ఆదర్శ రైతులు గ్రామస్థాయిలో రైతులకు వాస్తవ పరిస్థితులను వివరించాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన ఏడు రకాల పంటలకే కొనుగోలు సదుపాయం ఉంటుందని, ఇతర పంటలకు బోనస్ వర్తించదనే విషయాన్ని ప్రతి రైతుకు స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు. రైతు బీమా క్లెయిమ్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉండకూడదని, అర్హులైన కుటుంబాలకు సకాలంలో ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. 20 రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లాలో ప్రతి క్లస్టర్‌లో మహిళా శక్తి కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువుల విక్రయ కేంద్రాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారని, అదే తరహాలో జిల్లాలో కూడా ప్రతి క్లస్టర్‌కు ఒక మహిళా శక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో తిరుమల ఆయిల్ కంపెనీ సీఈవో కళ్యాణ్, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ ఉద్యానవన శాఖ అధికారి శ్యాం ప్రసాద్, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

