* విజయం సాధించే వరకు ప్రయత్నించాలి.. ప్రజలకు భరోసానిచ్చే పోలీస్ అధికారులుగా ఎదగాలి: మంత్రి సీతక్క
ములుగు: యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేలా అవసరమైన ప్రోత్సాహం, ఉచిత శిక్షణ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అనసూయ సీతక్క అన్నారు. ములుగు ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు ఉచిత శిక్షణ పొందనున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు తగిన ప్రోత్సాహం, శిక్షణ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పోలీస్ ఉద్యోగాల ప్రకటన వెలువడిన వెంటనే జిల్లా ఎస్పీతో చర్చించి ఉచిత శిక్షణకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. శిక్షణ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో సహకరించిన జిల్లా కలెక్టర్‌ను అభినందించారు.
టాస్క్ సౌజన్యంతో ఉచిత శిక్షణ అందించేందుకు ముందుకొచ్చిన విశ్వనాథ్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులను మంత్రి అభినందించారు.
250 మంది అభ్యర్థులకు శిక్షణ
పోలీస్ ఉద్యోగాల ఎంపికలో శారీరక ప్రమాణాలు కీలకమైనందున అభ్యర్థులు కష్టపడి సిద్ధమైన అనంతరం కొలతల కారణంగా అనర్హులు కాకుండా ముందుగానే ప్రాథమిక పరిశీలన చేపట్టినట్లు సీతక్క తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శారీరక కొలతలను పరిశీలించి శిక్షణకు ఎంపిక చేసిన 250 మంది అభ్యర్థులను మంత్రి అభినందించారు.
శిక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదివి ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. ఉద్యోగం సాధించే వరకు నిరంతరం ప్రయత్నం కొనసాగించాలని సూచించారు.
నిరాశ చెందకుండా మళ్లీ ప్రయత్నించాలి
రాత పరీక్షలోనైనా, శారీరక సామర్థ్య పరీక్షల్లోనైనా ఆశించిన ఫలితం రాకపోతే నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించాలని మంత్రి సూచించారు. కుటుంబ బాధ్యతలకు సమయం కేటాయిస్తూనే చదువుకు, శారీరక సాధనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
అభ్యర్థులు పోషకాహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా శారీరక సాధన చేయాలని సూచించారు. శిక్షణ సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తనకు లేదా డీఎస్పీకి తెలియజేయాలని కోరారు. ప్రస్తుతం కష్టపడి ఉద్యోగం సాధిస్తే భవిష్యత్తులో కుటుంబానికి అండగా నిలవగలుగుతారని అన్నారు.
ఇతర జిల్లాల యువతకూ శిక్షణ
ములుగు నియోజకవర్గ పరిధిలోని ఇతర జిల్లాలకు చెందిన యువతకు కూడా శిక్షణ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు సీతక్క తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని గంగారం, కొత్తగూడ మండలాల యువత కోసం అక్కడి కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడినట్లు, ఆ జిల్లాలో కూడా శిక్షణ ప్రారంభమైనట్లు చెప్పారు.
భూపాలపల్లి జిల్లాలో నియోజకవర్గ పరిధిలోని ఐదు గ్రామాల యువతకు కూడా శిక్షణ అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గతంలో ఉద్యోగ మేళా నిర్వహించామని, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఉద్యోగాలు సాధించి ప్రజలకు భరోసా కల్పించే పోలీస్ అధికారులుగా యువత ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, ములుగు సీఐ, పసర సీఐ, పోలీస్ సిబ్బంది, శిక్షణ పొందనున్న అభ్యర్థులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

