ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం జూలై 15న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ గ్రంథాలయం, డిగ్రీ, పీజీ, బీఈడీ కళాశాలలతో పాటు విద్యార్థి వసతి గృహాల్లో మంగళవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. కేంద్రం హామీ ఇచ్చిన విధంగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, శాఖల్లో ఖాళీగా ఉన్న 10 లక్షల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు, 20 వేల పోలీస్ పోస్టులతో పాటు గ్రూప్-1, 2, 3, 4, డీఎస్సీ, జేఎల్ నోటిఫికేషన్లను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈ ధర్నాలో నిరుద్యోగ యువతీ యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

