* నోటీసుల జారీ, అభ్యంతరాల పరిష్కారంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సమీక్ష
* నిర్దేశిత గడువులో పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేయాలి
ములుగు: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసుల జారీ, ఫిర్యాదులు, అభ్యంతరాల పరిష్కారం, సంబంధిత రికార్డుల పరిశీలన తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఆర్డీఓ కృష్ణవేణితో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నోటీసుల పంపిణీని మరింత వేగవంతం చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న అన్ని నోటీసులను సంబంధిత వ్యక్తులకు తప్పనిసరిగా అందజేయాలని, నోటీసులు అందజేసిన తేదీ నుంచి 7 రోజుల గడువు పూర్తైన అనంతరం విచారణ చేపట్టాలని ఆదేశించారు.
ఫిర్యాదులు, అభ్యంతరాలపై నిర్దిష్ట గడువులో విచారణ నిర్వహించాలని, సంబంధిత రికార్డుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. అనామలీస్, నో మ్యాపింగ్ జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ఏజెంట్లకు అందుబాటులో ఉంచాలని సూచించారు.క్లెయిమ్స్, అభ్యంతరాల సందర్భంగా సమర్పించాల్సిన పత్రాలు, ఆధారాలపై సంబంధిత వ్యక్తులకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని తెలిపారు. క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రస్తుత స్థితిని రోజువారీగా నోటీస్ బోర్డుపై నవీకరించాలని సూచించారు.
ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తూ నిర్దేశిత గడువులో పనులను పూర్తి చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిష్కార ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రక్రియ కోసం నియమించిన ఏఈఆర్ఓలకు అవసరమైన శిక్షణ అందించాలని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
జిల్లాలో 41,900 నోటీసులు జనరేట్
జిల్లా కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ జిల్లాలో అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు సంబంధించి 41,900 నోటీసులు జనరేట్ చేసినట్లు తెలిపారు. వీటిలో ఇప్పటివరకు 10,909 నోటీసులు జారీ చేసి, యాప్‌లో వివరాలను నవీకరించినట్లు వెల్లడించారు.
అలాగే 448 నోటీసుల హియరింగ్ ప్రక్రియ పూర్తయిందని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రక్రియను నిర్వహిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల విభాగం నాయబ్ తహసీల్దార్ ఎం. నితీష్ తదితరులు పాల్గొన్నారు.

