* మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
* హామీల అమలు వైఫల్యంపై 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో బీఆర్ఎస్ ఆందోళన
పెద్దపల్లి బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇందులో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో దాసరి ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ నుంచి బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వరకు పార్టీ శ్రేణులతో కలిసి భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు.
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ ఎండగట్టేలా 420 అడుగుల పొడవైన భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్‌రెడ్డి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, ఆరు గ్యారంటీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని ప్రజల వెలుగులోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రజలను మరింత చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత గులాబీ శ్రేణులపై ఉందన్నారు. ప్రభుత్వం ఇంకా అమలు చేయాల్సిన పథకాలు, ప్రజలకు చెల్లించాల్సిన బాకీల వివరాలన్నీ స్పష్టంగా ఉండేలా రూపొందించిన బాకీ కార్డులను ప్రతి ఇంటా పంపిణీ చేయాలని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. మండల కేంద్రాల నుంచి నియోజకవర్గ కేంద్రం వరకు పార్టీ కార్యక్రమాలన్నింటినీ ఎంతో సమన్వయంతో, పకడ్బందీగా నిర్వహించాలని కోరారు.
ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ వెనకడుగు వేయదని, నిరంతరం ప్రజల పక్షాన పోరాటాలు సాగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసే బలమైన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తామని ఆయన తేల్చిచెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రఘువీర్‌సింగ్, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, మండల అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, సుల్తానాబాద్ పట్టణ అధ్యక్షుడు పారుపల్లి గుణపతితో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

