పెద్దపల్లి : సింగరేణి సీఎస్‌ఆర్ నిధులతో వడకాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాల, గ్రామ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి వినతిపత్రం బీజేపీ యువ నాయకులు ఎర్రోళ్ల శ్రీకాంత్ అందజేశారు. సింగరేణి భరోసా యాత్ర సందర్భంగా కాటారం విచ్చేసిన కేంద్ర బొగ్గు అండ్ గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ని బీజేపీ యువ నాయకులు ఎర్రోళ్ల శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సింగరేణి సీఎస్‌ఆర్ నిధుల ద్వారా జూలపల్లి మండలంలోని వడకాపూర్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, నూతన పాఠశాల భవనం, అదనపు తరగతి గదులు, విద్యార్థులకి టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే గ్రామంలో తాగునీటి సౌకర్యం, హైమాస్ట్ ఎల్‌ఈడీ లైట్లు, గ్రంథాలయం, ఇతర ప్రజా మౌలిక వసతుల అభివృద్ధికి కూడా సింగరేణి సీఎస్‌ఆర్ నిధులను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, గ్రామ ప్రజలకు మెరుగైన జీవన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ వినతిపత్రాన్ని అందజేసినట్లు ఎర్రోళ్ల శ్రీకాంత్ తెలిపారు. ఈ వినతిపత్రాన్ని స్వీకరించిన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో చర్చించి సాధ్యమైన మేరకు సింగరేణి సీఎస్‌ఆర్ నిధుల ద్వారా అభివృద్ధి పనులకు సహకారం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎర్రోళ్ల శ్రీకాంత్ వెల్లడించారు.

