* కాంగ్రెస్ మార్కు పాలనపై చందర్ అస్త్రం
* రామగుండంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి.. ఘనంగా ‘సమర శంఖారావం’
* హామీలు నెరవేర్చకపోతే నేలకు ముక్కు రాసి క్షమాపణ చెప్పాలి: మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
రామగుండం:“చెప్పినారు.. చెవుల పువ్వు పెట్టినారురా.. హామీలతో మాయమాటలు అల్లినారురా.. పథకములన్ని బంద్ చేసి పాడె కట్టినారురా” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం రామగుండంలో ‘సమర శంఖారావం’ పేరుతో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రామగుండం కౌన్సిల్ కో-ఆర్డినేటర్ మేకల సమ్మయ్య యాదవ్ అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు 420 హామీలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం:
ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి వందల రోజులు గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానినీ పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం దారుణమన్నారు. తెలంగాణ జాతి పిత కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్క పిల్లర్‌ను కూడా రిపేర్ చేయలేని స్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని విమర్శించారు.
ప్రజలను మోసం చేసినందుకు ప్రభుత్వం వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయకపోతే ప్రజల ముందు నేలకు ముక్కు రాసి క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నారు.
‘అభయహస్తం’ పేరుతో నయవంచన:
ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరుగుతూ ‘అభయహస్తం’ కార్డులు చూపించి మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులకు రూ.4,000 పింఛన్, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, దళితులకు అంబేడ్కర్ అభయహస్తం అందిస్తామని చెప్పి ప్రజల చెవిలో పువ్వులు పెట్టారని చందర్ ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అమలైన రైతుబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలను సైతం నిలిపివేసి, పథకాలకు పాడె కట్టారని విమర్శించారు.
రామగుండంలో అభివృద్ధి శూన్యం:
రాష్ట్రంలో పెద్ద ‘420’ రేవంత్ రెడ్డి అయితే.. రామగుండంలో చిన్న ‘420’ స్థానిక ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్ అని చందర్ తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేపట్టకుండా, లక్ష్మీనగర్‌లో పువ్వులు చల్లించుకుంటూ విడ్డూరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పోరాడిన చరిత్ర బీఆర్ఎస్దేనని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చందర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మెరియాల రాజిరెడ్డి, కౌశిక్ హరినాథ్, నడిపెల్లి మురళీధర్ రావు, హరీష్ రెడ్డి, మూల విజయారెడ్డి, మహేష్, కర్క పద్మజ, రమేష్, కిషన్ రెడ్డి, నటుపల్లి శ్రీనివాస్, ఈదునూరి శ్రీకాంత్, మచ్చ వేణు, జక్కుల తిరుపతి, నూతి తిరుపతి, దేవుడు దేవరాజ్, బొడ్డుపెల్లి రవీందర్, సాయి కుమార్ (చింటు)తో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

