**ప్రజానవ ,హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్‌పర్సన్ కిషోర్ మక్వానా సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషన్ సభ్యులతో కలిసి మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలను ముఖ్యమంత్రి జాతీయ ఎస్సీ కమిషన్ ప్రతినిధులకు వివరించారు. ముఖ్యంగా విద్యార్థుల మధ్య కుల వివక్షను నిర్మూలించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిందని తెలిపారు.
ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (YIIRS) నిర్మిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటిని అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని సీఎం వెల్లడించారు.
నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను అందించే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు రవాణా సౌకర్యం కూడా కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. తొలి దశలో కోర్ అర్బన్ రీజియన్‌లో వీలైనన్ని తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ప్రారంభించనున్నట్లు వివరించారు.
రాష్ట్రంలో ఎస్సీలకు వారి జనాభా శాతం కంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాజకీయాలతో పాటు వివిధ రంగాల్లో కీలక పదవుల్లో ఎస్సీలకు ప్రాధాన్యం కల్పిస్తున్నామని, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేసి అమలు చేస్తున్నామని తెలిపారు.
షెడ్యూల్డ్ కులాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందించేలా జాతీయ ఎస్సీ కమిషన్ చొరవ చూపాలని ముఖ్యమంత్రి కోరారు.
ఈ సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

