అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పెద్దపల్లిలో అవగాహన ర్యాలీ, మానవహారం.
పెద్దపల్లి : రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు,అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి ఎస్‌ఐ నరేష్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని కళాశాల మైదానం నుంచి జెండా చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
అనంతరం జెండా చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేసి మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి,పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ హాజరయ్యారు.
ఏసీపీ జి.కృష్ణ మాట్లాడుతూ,నేటి బాలలే రేపటి ఉత్తమ పౌరులని,దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని అన్నారు.యువత ఆరోగ్యంగా, క్రమశిక్షణతో,మంచి అలవాట్లతో ఎదగాలని,గంజాయి, మద్యం,సిగరెట్లు, ఇతర మాదకద్రవ్యాలు వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివించి వారి మంచి భవిష్యత్తు కోసం శ్రమిస్తున్నారని,వారి ఆశలను వమ్ము చేయకుండా విద్యార్థులు లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలని కోరారు. మాదకద్రవ్యాల వ్యసనం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబానికి, సమాజానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు.
తెలంగాణ ప్రభుత్వం మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని పేర్కొంటూ,డ్రగ్స్ వినియోగం,విక్రయం, అక్రమరవాణా లేదా గంజాయి సాగుకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే డయల్-100 లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1908కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
గంజాయి సాగు,అక్రమ రవాణా, విక్రయం లేదా వినియోగంలో పాల్గొనే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించి పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.డీసీపీ బి. రామ్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమైన డ్రగ్స్ రహిత రాష్ట్ర నిర్మాణంలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో విద్యార్థులకు విస్తృత స్థాయిలో మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
గత కొన్ని రోజులుగా పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ, గోదావరిఖని ఏసీపీ రమేష్,సీఐ ప్రవీణ్ కుమార్‌తో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.
డ్రగ్స్ వినియోగం మానవ శరీరంలోని కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి విద్యాభ్యాసంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని శారీరక,మానసిక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి విద్యార్థి,ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, డ్రగ్స్ రహిత పెద్దపల్లి జిల్లా,డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని డీసీపీ పిలుపునిచ్చారు.
అనంతరం విద్యార్థులు,ప్రజలతో కలిసి మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, గంజాయి,ఇతర మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు కృషి చేస్తామని డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పెద్దపల్లి ఎస్‌ఐ నరేష్, రూరల్ ఎస్‌ఐ మధుకర్,ఎస్‌ఐ శ్వేతతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది,విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

