◆ వెంటనే పదవికి రాజీనామా చేయాలి: బీఆర్‌ఎస్ నాయకులు
◆ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలి
◆ ఎస్పీ, కలెక్టర్‌కు ఆధారాలతో వినతిపత్రం సమర్పణ
ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ దళితుల భూములను అక్రమంగా కాజేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీ కృష్ణానాయక్, నాయకులు గంధం పరంజ్యోతి, ఎం. రాజశేఖర్, దొడ్ల రాములు, జాతృ నాయక్ మాట్లాడారు. గత మూడేళ్లుగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి, వాటిని నిరూపించలేకపోయారని మండిపడ్డారు.
తక్షణమే నిరంజన్ రెడ్డికి ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెలుటూరు శివారులోని సర్వే నంబర్ 517/A2లో ఉన్న 0.39 గుంటల నిషేధిత లావణి పట్టా భూమిని నిబంధనలకు విరుద్ధంగా, అధికారులను బెదిరించి తన పేరిట మార్పించుకున్నారని ఆరోపించారు.
ఎన్నికల అఫిడవిట్‌లో ఈ భూమిని ‘పట్టా’ భూమిగా చూపి తప్పుడు సమాచారం ఇచ్చారని విమర్శించారు. అలాగే దోడగుంటపల్లి-అంకూరు నడుమ ప్రథమేష్ సోలార్ ప్లాంట్ కోసం దళారిగా వ్యవహరించి, దళితులకు చెందిన 5 ఎకరాల 10 గుంటల భూమిని ధారాదత్తం చేసి భారీగా కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు.
రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని, అక్రమాలకు సహకరించిన తహసీల్దార్, సబ్‌రిజిస్ట్రార్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీ, కలెక్టర్‌లకు వినతిపత్రం అందజేసినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే అవినీతి చిట్టాను ఆధారాలతో సహా డైలీ సీరియల్‌లా బయటపెడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

