* ఎన్నికల హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్
* సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీలో దివ్యాంగుల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం
* ఇందిరా పార్క్ వద్ద త్వరలో మహా ధర్నా నిర్వహిస్తాం
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సమర శంఖారావం’ సభలో మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దివ్యాంగులను ఉద్దేశించి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో దివ్యాంగుల పట్ల కనీస మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల పెన్షన్‌ను రూ.500 నుంచి రూ.4,016కు పెంచినట్లు తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆసరా పెన్షన్ల కోసం సుమారు రూ.54 వేల కోట్లు ఖర్చు చేయగా, అందులో దివ్యాంగులకు రూ.10,300 కోట్లు అందించామని పేర్కొన్నారు.
దివ్యాంగులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లలో 5 శాతం రిజర్వేషన్, విద్యా–ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు తెలంగాణకు జాతీయ స్థాయిలో అవార్డు లభించిందని గుర్తుచేశారు.
రూ.6 వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల పెన్షన్‌ను ఒక్క రూపాయి కూడా పెంచలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో నెలకు రూ.6 వేల పెన్షన్, ఉచిత బస్సు ప్రయాణం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ వంటి హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని విస్మరించిందని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 33 నెలలు పూర్తవుతున్నా ఇచ్చిన హామీలు అమలు కాలేదని అన్నారు. రాష్ట్రంలోని సుమారు 5.11 లక్షల మంది దివ్యాంగులకు నెలకు రూ.6 వేల చొప్పున పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఒక్కొక్క దివ్యాంగుడికి ఈ ప్రభుత్వం రూ.66 వేల వరకు బకాయి పడిందని పేర్కొన్నారు.
దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా, లేక మనసు లేదా అని ప్రశ్నించారు. ఇతర కార్యక్రమాలకు, ప్రభుత్వ ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.
దివ్యాంగుల హక్కుల కోసం బీఆర్ఎస్ కార్యాచరణ
దివ్యాంగుల హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ మూడు కీలక కార్యాచరణలను ప్రకటించింది.
సెప్టెంబర్ 7 నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో దివ్యాంగుల సమస్యలపై బీఆర్ఎస్ బలమైన గొంతుకగా నిలబడి ప్రభుత్వాన్ని నిలదీయనుంది.త్వరలో తేదీ ఖరారు చేసి హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద దివ్యాంగుల హక్కుల కోసం భారీ మహా ధర్నా నిర్వహించనుంది.కేసీఆర్‌తో చర్చించి త్వరలో బీఆర్ఎస్ దివ్యాంగుల విభాగాన్ని అధికారికంగా ఏర్పాటు చేసి, దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం అండగా నిలవనున్నట్లు ప్రకటించారు.
SIRపై దివ్యాంగులకు సూచనలు
SIR ఫేజ్-2లో ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. నోటీసులు అందుకున్న దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు సరైన వివరాలు, ఆధారాలను సమర్పించి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శిస్తూ, దివ్యాంగులు ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో ప్రజలను చైతన్యవంతం చేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని, కొత్తగా ఎలాంటి కోరికలు కోరడం లేదని స్పష్టం చేశారు. దివ్యాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

