Friday, September 4, 2026

Buy now

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం

* వల్భాపూర్ గ్రామంలో అభివృద్ధి, సంక్షేమంపై సమీక్ష
* అర్హులైన ప్రతి ఒక్కరూ పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలి
* ఆరుతడి పంటలు, ఆయిల్‌పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలి

వల్భాపూర్: ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని, అధికారులను ప్రజల వద్దకు తీసుకువచ్చి పరిష్కారం చూపడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం వీర వల్భాపూర్ గ్రామంలో “పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

వల్భాపూర్‌కు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి
గ్రామంలో 13 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 233 మందికి పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు. 349 కుటుంబాలకు గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 464 మంది రైతులకు రైతు భరోసా, 176 మంది రైతులకు రుణమాఫీ ప్రయోజనం, 56 కొత్త రేషన్ కార్డులు తదితర సంక్షేమ ప్రయోజనాలు అందుతున్నాయని వివరించారు.

మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, బ్యాంకు లింకేజీ రుణాలు అందించడంతో పాటు, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు స్టీల్ బ్యాంక్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

గ్రామ సమస్యల పరిష్కారానికి చర్యలు

వల్భాపూర్ మహిళా భవనానికి సంబంధించిన స్థల సమస్యను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. గ్రామంలోని కాలువలు, రోడ్లు, డ్రైనేజీలు, సర్వీస్ రోడ్డు తదితర సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ప్రజలకు మౌలిక వసతులు మెరుగ్గా అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు.

నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి

ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, నీటి సంరక్షణకు ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటలు, ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్‌పామ్ సాగు వైపు దృష్టి సారించాలని కోరారు.

ఈ నెల 31లోపు పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలి

అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ నెల 31వ తేదీలోపు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. అర్హత ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విద్య, క్రీడలకు ప్రాధాన్యత
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. యువత మొబైల్ ఫోన్లకు బానిసలు కాకుండా క్రీడల వైపు అడుగులు వేయాలని, మైదానాల్లో క్రీడలు ఆడి ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు.

సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాలి
ప్రతి కుటుంబం పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించుకోవాలని మంత్రి సూచించారు. సౌర విద్యుత్ వినియోగంతో విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు.

ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం, అధికారులను ప్రజల వద్దకు తీసుకువచ్చి అక్కడికక్కడే పరిష్కార మార్గాలను చూపడమే “పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Related Articles

spot_img

Most Popular