Wednesday, July 15, 2026

Buy now

ప్రతిభ కలిగిన పోలీసు క్రీడాకారులను ప్రోత్సహిస్తాం: సీపీ అంబర్ కిశోర్ ఝా

ప్రజానవ బ్యూరో, పెద్దపల్లి: 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో క్లస్టర్–ఏ క్రీడల్లో కాళేశ్వరం జోన్ 48 పతకాలు సాధించడం గర్వకారణమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. ప్రతిభ కనబరిచిన పోలీసు క్రీడాకారులకు శాఖ తరఫున ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తామని ఆయన తెలిపారు.

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్స్‌లో ఇటీవల నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026, క్లస్టర్–ఏలో ప్రతిభ కనబర్చి పతకాలు సాధించిన పోలీసు క్రీడాకారులను సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో సీపీ సత్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన పతక విజేతలను వ్యక్తిగతంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, జట్టు సమన్వయం, పరస్పర సహకారం, నిరంతర సాధన, లోపాలను గుర్తించి సరిదిద్దుకునే తత్వం వల్లే ఈ స్థాయి విజయం సాధ్యమైందన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం జోన్ బృందం ప్రదర్శించిన ప్రతిభ ప్రశంసనీయమని పేర్కొన్నారు.

పోలీసు ఉద్యోగంలో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావన, సమన్వయం ఎంతో కీలకమని సీపీ అన్నారు. క్రీడలు ఈ లక్షణాలను పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని, నేరాల దర్యాప్తు నుంచి శాంతిభద్రతల పరిరక్షణ వరకు ప్రతి బాధ్యతలో జట్టు సమన్వయం విజయానికి దోహదపడుతుందని తెలిపారు.

ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది క్రీడాస్ఫూర్తిని అలవర్చుకుని పరస్పర విశ్వాసంతో సమిష్టిగా పనిచేస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందిస్తూ, భవిష్యత్తులోనూ శాఖకు మరింత కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని కోరారు.

క్రీడలకు సమయం కేటాయించే పోలీసు అధికారులు, సిబ్బందికి శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని సీపీ హామీ ఇచ్చారు. క్రమశిక్షణ, సమన్వయం, నిరంతర సాధనతోనే క్రీడల్లో విజయం సాధ్యమవుతుందని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని కూడా పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ఈ క్రీడల్లో కాళేశ్వరం జోన్ తరఫున 51 మంది పాల్గొనగా, 31 మంది క్రీడాకారులు మొత్తం 48 పతకాలు సాధించారు. ఇందులో 8 బంగారు, 16 వెండి, 24 కాంస్య పతకాలు ఉన్నాయి. పతక విజేతల్లో రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు చెందిన నలుగురు, ములుగు జిల్లా నుంచి ముగ్గురు, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి తొమ్మిది మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 15 మంది ఉన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, జూన్ సూపరింటెండెంట్ సందీప్, ఆర్‌ఐలు దామోదర్, మల్లేశం, శేఖర్, రమేష్, జయశంకర్ భూపాలపల్లి ఆర్‌ఐ కాసిరామ్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ ఆర్‌ఐ శ్రీనివాస్, ఆర్‌ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular