* పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి : రాష్ట్ర ప్రభుత్వం భూ రీ-సర్వే కార్యక్రమాన్ని దశలవారీగా అమలు చేస్తోందని ,భూ రీ-సర్వే కార్యక్రమానికి ప్రజలు, రైతులు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం తెలిపారు. జిల్లాలో తొలి విడతలో ధర్మారం మండలం పైడిచింతలపల్లి, పెద్దపల్లి మండలం నిమ్మన్‌పల్లి, సుల్తానాబాద్ మండలం రెబ్బల్‌దేవ్‌పల్లి, రామగిరి మండలం పన్నూర్, మంథని మండలం మల్లాపల్లి గ్రామాల్లో భూ రీ-సర్వే కార్యక్రమం ప్రారంభమై కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. ఆయా గ్రామాల్లో గ్రామ సరిహద్దుల నిర్ధారణ పనులు పూర్తవగా, గ్రామకంఠం సర్వే పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అలాగే జూలై 15 నుంచి అంతర్గాం మండలం సోమనపల్లి, ఎలిగేడు మండలం లోకపేట, పెద్దపల్లి మండలం రంగంపల్లి, పాలకుర్తి మండలం గూడిపల్లి, శ్రీరాంపూర్ మండలం మంగపేట, ఓడెల మండలం గూడెం, మంథని మండలం అంగుళూరు, ముత్తారం (మంథని) మండలం శుక్రవారంపేట గ్రామాల్లో భూ రీ-సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ గ్రామాల్లో జూలై 14న గ్రామసభలు నిర్వహించి ప్రజలకు కార్యక్రమంపై అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. ప్రతి గ్రామంలో రీ-సర్వే చేపట్టే ముందు గ్రామసభ నిర్వహించి, భూ యజమానులకు కార్యక్రమం ఉద్దేశ్యం, విధివిధానాలను వివరించిన అనంతరమే సర్వే చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. సర్వే అండ్ బౌండరీస్ చట్టం–1923 నిబంధనల ప్రకారం రీ-సర్వే ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భూ రీ-సర్వే ద్వారా భూ హద్దుల ఖచ్చితమైన నిర్ధారణ, భూ రికార్డుల నవీకరణ, భూ వివాదాల నివారణకు దోహదపడుతుందని కలెక్టర్ తెలిపారు. సర్వే సమయంలో భూ యజమానులు తమ భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవడంతో పాటు అవసరమైన పత్రాలతో అందుబాటులో ఉండాలని సూచించారు. భూ రీ-సర్వే కార్యక్రమం విజయవంతం కావడానికి సంబంధిత గ్రామాల ప్రజలు, రైతులు గ్రామసభలకు హాజరై అధికారులు, సర్వేయర్లు, లైసెన్స్‌డ్ సర్వేయర్లకు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

