◆ రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ మండిపాటు
◆ హామీలు నెరవేర్చేదాకా సెప్టెంబర్ 8 వరకు రైతు సదస్సులు
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలకు నిరసనగా రేవల్లి మండలం బండరాయిపాకుల చౌరస్తాలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి, రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ భీమయ్య, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు శివరాం రెడ్డి మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం కింద రూ.2,500, తులం బంగారం, స్కూటీలు, రూ.4,000 పింఛన్, రైతు భరోసా, రుణమాఫీ వంటి హామీలను ప్రభుత్వం మర్చిపోయిందని ఆరోపించారు.
యూరియా కొరత, సాగునీటి సమస్యలు, 22-A భూ వివాదాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దగా పాలనకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 8 వరకు నిరసనలు, రైతు సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లక్ష్మి, పాపులు, సుధాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.

