Friday, September 4, 2026

Buy now

రోజుకు 1.90 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించాలి:సింగరేణి సీఎండీ

* అన్ని ఏరియాల జీఎంలకు సింగరేణి సీఎండీ డా. బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 4:పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయడానికి సింగరేణిలో రోజుకు 1.90 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాన్ని సాధించాలని సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా. బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశించారు.

శుక్రవారం సింగరేణి భవన్ నుంచి సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో బొగ్గు ఉత్పత్తిపై ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గును అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలపై ఉందని ఆయన తెలిపారు.

దేశ ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని సింగరేణి అధికారులు, కార్మికులు శక్తివంచన లేకుండా పనిచేసి ఉత్పత్తి, రవాణాను పెంచాలని సీఎండీ సూచించారు. ఈ సందర్భంగా ఏరియాల వారీగా ఇప్పటివరకు నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిని సమీక్షించారు.

ఐదు నెలల్లో 253 లక్షల టన్నుల బొగ్గు రవాణా:
ఆగస్టు 31 నాటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐదు నెలలు పూర్తయ్యాయని, ఈ కాలంలో సింగరేణి 253 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసిందని అధికారులు సీఎండీకి వివరించారు. ఇందులో 90 శాతానికి పైగా బొగ్గును థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేసినట్లు తెలిపారు.అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించుకోవాలని డా. బుద్ధప్రకాష్ జ్యోతి స్పష్టం చేశారు.

నైనీ నుంచి రాష్ట్ర విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా:
నైనీ బొగ్గు గని నుంచి సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి తొలి రైల్వే రేక్ ద్వారా బొగ్గు సరఫరా చేసినట్లు సీఎండీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి కూడా ఇటీవల మరో రేక్ బొగ్గును సరఫరా చేసినట్లు చెప్పారు.

ఇకపై రాష్ట్ర విద్యుత్ అవసరాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ నైనీ బ్లాక్ నుంచి రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా కొనసాగిస్తామని వెల్లడించారు.

ఓబీ తొలగింపుపై ప్రత్యేక దృష్టి:
బొగ్గు ఉత్పత్తి, రవాణాతో పాటు ఓవర్ బర్డెన్ (ఓబీ) తొలగింపుపై కూడా సీఎండీ సమీక్ష నిర్వహించారు. ఆగస్టు నెలాఖరు వరకు ఆఫ్‌లోడింగ్ ద్వారా 1,315 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగించినట్లు అధికారులు తెలిపారు. ఇది నిర్దేశించిన లక్ష్యంలో 95 శాతంగా ఉందని పేర్కొన్నారు.

వంద శాతానికి పైగా ఓబీ తొలగించేలా ఆఫ్‌లోడింగ్ ఏజెన్సీలను సమాయత్తం చేయాలని సీఎండీ ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రోజువారీ లక్ష్యాలను మించి బొగ్గు ఉత్పత్తి సాధించాలని సూచించారు.

రైల్వే శాఖతో సమన్వయం పెంచుకుని బొగ్గు రవాణాలో కూడా వంద శాతానికి పైగా లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు.

భద్రత, నాణ్యతలో రాజీ వద్దు:
బొగ్గు ఉత్పత్తి, రవాణాతో పాటు రక్షణా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని డా. బుద్ధప్రకాష్ జ్యోతి సూచించారు. నాణ్యమైన బొగ్గును వినియోగదారులకు సరఫరా చేసేందుకు పైస్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు సమష్టిగా కృషి చేయాలని అన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, గౌతమ్ పోట్రు, ఎం. తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. వెంకన్న, జనరల్ మేనేజర్ టి. శ్రీనివాస్, కార్పొరేట్ జనరల్ మేనేజర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular