Wednesday, July 15, 2026

Buy now

రైతు భరోసాతో కర్షకులకు అండగా నిలిచాం: సీఎం రేవంత్ రెడ్డి

* 2029లో 117 స్థానాలు గెలిచి ‘ప్రజా ప్రభుత్వం 2.0’ ఏర్పాటు చేస్తాం

ప్రజానావ బ్యూరో, ఖమ్మం:ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహించిన”రైతు ఆశీర్వాద సభ” లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి, కర్షకుల పట్ల తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకున్నామని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కొందరు దొంగ సర్వేలను చూసుకుని సంబరపడుతున్నారని విమర్శించారు. వచ్చే శాసనసభ ఎన్నికలు 2029లో జరుగుతాయని, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 అసెంబ్లీ స్థానాలు గెలిచి “ప్రజా ప్రభుత్వం 2.0” ను ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాజకీయంగా పాలమూరు తనకు ప్రాణమైతే, ఖమ్మం తన గుండెకాయ అని పేర్కొన్న సీఎం, బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబంలోనే ఒకరిపై ఒకరికి నమ్మకం లేదని ఆరోపించారు. బీజేపీలోకి వెళ్లబోనని హరీష్ రావు కేసీఆర్‌పై ఒట్టు వేసి చెప్పగలరా అని ప్రశ్నించారు. అలాగే బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారని కేటీఆర్ సొంత సోదరియే చెబుతున్నారని, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టర్లు బీఆర్ఎస్‌కు రూ.1,400 కోట్లు ఇచ్చారని కూడా ఆమె ఆరోపించారని అన్నారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు అందించామని సీఎం తెలిపారు. రైతు భరోసా మొత్తాన్ని రూ.12 వేలుకు పెంచడంతో పాటు రైతు రుణమాఫీ అమలు చేసి రైతులను రుణ విముక్తులను చేశామని పేర్కొన్నారు.

చివరగా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు ప్రజలు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. “ఔర్ ఏక్ బార్… కాంగ్రెస్ సర్కార్” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

Related Articles

spot_img

Most Popular