ప్రజానవ,సిరిసిల్ల: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ముందస్తు చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా రోడ్డు భద్రతా కమిటీ చైర్‌పర్సన్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ మహేష్ బి. గితే, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గత మూడు నెలల్లో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, మరణాలపై సమీక్ష నిర్వహించి, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
గత సమావేశంలో గుర్తించిన సమస్యల పరిష్కారంలో భాగంగా ఎల్లారెడ్డిపేట–గొల్లపల్లి మార్గంలో రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసినట్లు, వేములవాడ మున్సిపల్ పరిధిలో సైన్‌బోర్డులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే వేములవాడ మార్గంలో రహదారిపైకి వంగిన చెట్ల కొమ్మలు, ప్రమాదకరమైన చెట్లను తొలగించినట్లు వివరించారు.
వేములవాడ కమాన్ నుంచి కొదురుపాక వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రగుడు జంక్షన్ వద్ద రోడ్డు భద్రతా చర్యలు చేపట్టి సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని, రుద్రంగి వద్ద రంబుల్ స్ట్రిప్స్‌తో పాటు ఇతర భద్రతా చర్యలు అమలు చేయాలని సూచించారు. కొదురుపాక జంక్షన్‌లో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సిరిసిల్ల–సిద్దిపేట, కరీంనగర్–కామారెడ్డి, వేములవాడ–రుద్రంగి తదితర ప్రధాన రహదారులపైకి వచ్చిన చెట్లు, కొమ్మలను వెంటనే తొలగించాలని కలెక్టర్ సూచించారు. వేములవాడ–దొంగలమర్రి మార్గంలో రూ.13.90 లక్షల వ్యయంతో రహదారి మరమ్మత్తులు, రంబుల్ స్ట్రిప్స్, రిఫ్లెక్టివ్ స్టడ్స్, సోలార్ బ్లింకర్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్న సిరిసిల్లకు చెందిన ఆటో డ్రైవర్ పి. శ్రీనివాస్‌కు కేంద్ర ప్రభుత్వ ‘రహవీర్’ పథకం కింద రూ.25 వేల ప్రోత్సాహక నగదు అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, వాహనదారుల ప్రాణాలను కాపాడటమే రోడ్డు భద్రతా కమిటీ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే, అవి జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను తరలించే వారిపై ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్కూల్ బస్సులు, ఆటోల్లో విద్యార్థులను నిబంధనలకు అనుగుణంగా తరలించాలని సూచించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ ఈఈ నరసింహాచారి, పీఆర్ ఈఈ సుదర్శన్ రెడ్డి, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్, రోడ్డు భద్రత కమిటీ సభ్యుడు శ్రీనాథ్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా విద్యాధికారి మొండయ్య, ఎస్‌బీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్, జాతీయ రహదారి అధికారులు, ఆర్టీసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

