* పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
* ప్రతి అభ్యర్థి ఉద్యోగం సాధించేలా కృషి చేయాలి
* శిక్షణ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి
* క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నిరంతర సాధనతో లక్ష్యాన్ని చేరుకోవాలి
* యువశక్తి పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ తరగతులను పరిశీలించిన కలెక్టర్
పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాల భర్తీలో పెద్దపల్లి జిల్లాకు చెందిన అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
సోమవారం కరీంనగర్లోని రేకుర్తి సమీపంలోని కిమ్స్ పి.జి. కళాశాలలో పెద్దపల్లి జిల్లా అభ్యర్థుల కోసం నిర్వహిస్తున్న యువశక్తి పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ తరగతులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ప్రత్యేకంగా ముచ్చటించి, శిక్షణ విధానం, బోధన, వసతి, భోజనం తదితర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రతి అభ్యర్థి జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, దానిని సాధించేందుకు క్రమశిక్షణ, పట్టుదలతో నిరంతరం శ్రమించాలని సూచించారు. జిల్లా యంత్రాంగం కల్పిస్తున్న ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని అభ్యర్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శిక్షణ కాలంలో ప్రతి రోజును విలువైనదిగా భావించి, ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సిద్ధం కావాలని కలెక్టర్ సూచించారు.
చదువుతో పాటు శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాలని, పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా నిరంతరం సాధన చేయాలని తెలిపారు. శిక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదవాలి. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో లక్ష్యాన్ని చేరుకోవాలి. ప్రతి అభ్యర్థి ఉద్యోగం సాధించేలా కృషి చేయాలి అని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. శిక్షణకు అవసరమైన అన్ని సదుపాయాలను సమర్థవంతంగా అందించాలని సంబంధిత అధికారులు, శిక్షణ నిర్వాహకులకు సూచించారు.
అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, భోజనం, బోధన తదితర అంశాల్లో నాణ్యతను పాటించాలని ఆదేశించారు. యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపిక కావడానికి అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని ప్రతి అభ్యర్థి సద్వినియోగం చేసుకొని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
పెద్దపల్లి జిల్లా అభ్యర్థుల కోసం కరీంనగర్లోని శౌర్య డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శిక్షణలో భాగంగా అభ్యర్థులకు ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయాలతో పాటు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో నాణ్యమైన శిక్షణ అందిస్తున్నారు. జూలై 27న ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమం మొత్తం 100 రోజుల పాటు కొనసాగనుంది. యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షలకు అభ్యర్థులను సమర్థవంతంగా సన్నద్ధం చేయడమే శిక్షణ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ప్రస్తుతం 100 మంది బాలికలు, 150 మంది బాలురు కలిపి మొత్తం 250 మంది అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి పి. ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎక్స్ సర్వీస్మెన్ ఎల్. మహిపాల్ రెడ్డి, శౌర్య డిఫెన్స్ అకాడమీ అధ్యాపకులు, కో-ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

