Friday, September 4, 2026

Buy now

వెయ్యి రోజుల ప్రజాపాలనలో వరంగల్ పశ్చిమకు కొత్త దిశ

* గత పదేళ్లలో జరగని అభివృద్ధిని రెండున్నరేళ్లలో కళ్లముందు చూపించాం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా టీపీసీసీ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట 1000 రోజుల ప్రజాపాలన విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.

‘రెండున్నరేళ్లలో అభివృద్ధిని కళ్లముందు చూపించాం’

ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్లలో జరగని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే ప్రజల కళ్లముందు నిలబెట్టిందన్నారు. గత పాలనకు, ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు స్వయంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. వరంగల్ విమానాశ్రయం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, మాస్టర్ ప్లాన్, కాలేజీలు, కలెక్టరేట్, పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐ అభివృద్ధితో పాటు బల్దియా పరిధిలోని ప్రధాన రహదారుల అభివృద్ధి వంటి పలు కీలక పనులు వరంగల్ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయని అన్నారు.

‘శిలాఫలకాల కోసం కాదు.. కనిపించే అభివృద్ధి కోసం’

గత పాలనలో శిలాఫలకాలు వేయడం, కొబ్బరికాయలు కొట్టడం, ప్రారంభోత్సవాల పేరుతో హడావుడి చేయడం తప్ప ప్రజలకు కనిపించే స్థాయిలో అభివృద్ధి జరగలేదని నాయిని విమర్శించారు. “మేము శిలాఫలకాల కోసం కాదు.. కళ్లముందు కనిపించే అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం” అని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వరంగల్ అభివృద్ధికి అవసరమైన నిధులను తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. నగరాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.

‘ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం’

“మేం సముద్రాన్ని తీసుకొస్తామని చెప్పలేదు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. డబుల్ బెడ్రూం ఇళ్లలో కూర్చోబెట్టి వైఫై ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టలేదు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, సంక్షేమంపైనే దృష్టి పెట్టాం” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

గత పాలనలో జరిగిన అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని నాయిని సవాల్ చేశారు. గత పదేళ్లలో వరంగల్ జిల్లాకు ఎన్ని నిధులు తీసుకొచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో ఎన్ని నిధులు తీసుకొచ్చిందో లెక్కలు ప్రజల ముందుంచాలని అన్నారు.

‘మిగిలిన పనులను కూడా పూర్తి చేస్తాం’

విమర్శలు, ధర్నాలు, ఆందోళనలతో రాజకీయ హైప్ సృష్టించడం సులభమేనని, అయితే తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపించే ధైర్యం తమకు ఉందని నాయిని అన్నారు. అభివృద్ధి పనుల్లో ఇంకా చేయాల్సినవి ఉన్నాయని, మిగిలిన పనులను కూడా దశలవారీగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

ప్రతిపక్షాలు తమ పాలనలో జరిగిన అభివృద్ధిని చూపకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పనుల్లో ఇంకా పూర్తికాని అంశాలనే పదేపదే ప్రస్తావిస్తున్నాయని విమర్శించారు. “మేము చేసిన 80 శాతం పనులను చూపించే ధైర్యం వారికి లేదు. చేయాల్సి ఉన్న మిగిలిన 20 శాతం పనుల గురించే మాట్లాడుతున్నారు” అని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నీతి, నిజాయితీ, పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజల కోసం పనిచేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవిస్తూ, ప్రజల సమస్యలపై పోరాడే స్వేచ్ఛను కల్పిస్తున్నామని తెలిపారు.

“గతంలో ఏం జరిగింది.. నేడు ఏం జరుగుతోంది అనేది మేము చెప్పాల్సిన అవసరం లేదు. అభివృద్ధిని మీ కళ్లముందే చూపిస్తున్నాం. ప్రజలే దీనికి సాక్షులు” అని నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇనగల వెంకట్రామ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular