* శ్రావణ మాసం రెండో సోమవారం సందర్భంగా పోటెత్తిన భక్తులు
* 87,540 మందికి పైగా స్వామివారి దర్శనం
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో శ్రావణ మాసం రెండో సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.
ఉదయం నుంచే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి కోడె మొక్కులు, అభిషేకాలు, ఆకు పూజలు, చండీ హోమం, నిత్య కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతాలు, కుంకుమ పూజలు తదితర సేవల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దేవస్థాన ఈవో ఎల్. రమాదేవి ఆదేశాల మేరకు ఆలయ పీఆర్వో పెరిక శ్రీనివాస్ రాత్రి 9 గంటల వరకు నమోదైన భక్తుల దర్శనాలు, పూజా సేవల వివరాలను వెల్లడించారు.
రాత్రి 9 గంటల వరకు సేవల వివరాలు
మొత్తం భక్తుల దర్శనం: 87,540 మంది
కోడె మొక్కులు (కోడె కట్టుట): 6,316
శీఘ్ర దర్శనాలు: 1,196
అతి శీఘ్ర దర్శనాలు: 320
శివ కళ్యాణం: 142
అభిషేకాలు: 119
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన అధికారులు, సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసి రద్దీని పర్యవేక్షించారు. ఆలయంలో దర్శనాలు, పూజా కార్యక్రమాలు సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టారు.

