Wednesday, July 15, 2026

Buy now

సింగరేణికి తాడిచర్ల–II బొగ్గు బ్లాక్ కేటాయింపు చారిత్రాత్మక నిర్ణయం

* సంస్థ భవిష్యత్, కార్మికుల ఉపాధి భద్రత కోసం మరిన్ని బొగ్గు బ్లాక్లు కేటాయించాలి
* INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్

హైదరాబాద్,గాంధీ భవన్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు తాడిచర్ల–II బొగ్గు బ్లాక్‌ను కేటాయించడం సంస్థ భవిష్యత్ అభివృద్ధి, బొగ్గు ఉత్పత్తి పెంపు, కార్మికుల ఉపాధి భద్రతకు అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మక నిర్ణయమని INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ తెలిపారు.

తాడిచర్ల–II బొగ్గు బ్లాక్ కేటాయింపుకు సహకరించిన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.సింగరేణి సంస్థ దీర్ఘకాలిక అభివృద్ధి, కార్మికుల ఉద్యోగ భద్రత, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక పురోగతిని దృష్టిలో ఉంచుకుని INTUC మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయని తెలిపారు. ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం తాడిచర్ల–II బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించడం సంతోషకరమైన విషయమన్నారు.

తాడిచర్ల–II బొగ్గు బ్లాక్‌లో సుమారు 182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా. ఈ బ్లాక్ ద్వారా సంవత్సరానికి సుమారు 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలిపారు. దీని ద్వారా రాబోయే 40 నుంచి 50 సంవత్సరాల వరకు సింగరేణి సంస్థకు అవసరమైన బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండి, సంస్థ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది ఏర్పడుతుందని పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ.64,000 కోట్ల వరకు రెవిన్యూ సమకూరే అవకాశం ఉందన్నారు. వేలం లేకుండా బొగ్గు బ్లాక్ కేటాయించడం ద్వారా సింగరేణి సంస్థకు సుమారు రూ.2,550 కోట్ల ప్రీమియం భారం ఆదా కానుందని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీలు, పన్నులు మరియు ఇతర ఆదాయాల రూపంలో సంవత్సరానికి సుమారు రూ.16,000 కోట్ల వరకు ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా సుమారు 1,200 మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని తెలిపారు. పరోక్షంగా రవాణా, యంత్ర పరికరాలు, సేవా రంగం, చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలు, ఇతర అనుబంధ రంగాల్లో వేలాది మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.

తాడిచర్ల–II బొగ్గు బ్లాక్ కేటాయింపు సింగరేణి సంస్థ స్థిరత్వం, బొగ్గు ఉత్పత్తి పెంపు, కార్మికుల ఉద్యోగ భద్రత, తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని జనక్ ప్రసాద్ తెలిపారు.భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సింగరేణికి కోయగూడెం బ్లాక్–3, సత్తుపల్లి బ్లాక్–3తో పాటు గోదావరి వ్యాలీలోని ఇతర బొగ్గు బ్లాకులను కూడా కేటాయించాలని INTUC పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

ఈ కీలక నిర్ణయానికి సహకరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి, మంత్రులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి కార్మికుల మరియు INTUC పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో INTUC రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.డి. చంద్రశేఖర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ధర్మపురి, త్యాగరాజన్, కాంపెల్లి సమయ్య, జెట్టి శంకర్ రావు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular