శ్రీరాంపూర్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం కలిసి, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)కు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్‌యూ) హోదా కల్పించాలని విజ్ఞప్తి చేసింది.
ఈ సందర్భంగా ఇటీవల సింగరేణికి తాడిచెర్ల–II బొగ్గు బ్లాక్‌ను కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కి జనక్ ప్రసాద్‌తో పాటు ఐఎన్‌టీయూసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం సింగరేణికి సీపీఎస్‌యూ హోదా కల్పించడం వల్ల కలిగే ప్రయోజనాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ హోదా లభిస్తే భూసేకరణ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు చట్టపరమైన, పర్యావరణ అనుమతులు త్వరగా లభిస్తాయని, కొత్త గనుల విస్తరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని వివరించారు. అలాగే దేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో సింగరేణి మరింత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, సింగరేణికి సీపీఎస్‌యూ హోదా కల్పించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహరెడ్డి, ధర్మపురి, వైస్ ప్రెసిడెంట్లు శ్యామ్, దాస్, సదానందం, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, మైనింగ్ స్టాఫ్ ఇన్‌చార్జ్ తిరుపతి రాజు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ గరిగె స్వామి తదితరులు పాల్గొన్నారు.

