సిరిసిల్ల: మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ వద్ద సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ) గోదాం నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
జిల్లా ఇందిరా మహిళా శక్తి భవనం సమీపంలో ప్రతిపాదించిన స్థలాన్ని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సీడబ్ల్యూసీ రీజినల్ మేనేజర్ ఎం. విష్ణువర్ధన్, రెవెన్యూ అధికారులతో కలిసి సందర్శించిన కలెక్టర్, సర్వే నంబర్లు, అందుబాటులో ఉన్న భూమి విస్తీర్ణం, గోదాం నిర్మాణానికి అవసరమైన భూవివరాలను అడిగి తెలుసుకున్నారు.
అలాగే ఎన్ని ఎకరాల్లో, ఎంత టన్నుల నిల్వ సామర్థ్యంతో గోదాంను నిర్మించనున్నారనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని, ప్రణాళికకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, తహసీల్దార్ మహేష్, సీడబ్ల్యూసీ అధికారులు, రెవెన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

