Friday, September 4, 2026

Buy now

164 చెరువుల సంరక్షణ, అభివృద్ధికి చర్యలు

* హద్దులు, ఎఫ్‌టీఎల్‌ సర్వే–మ్యాపింగ్‌ పూర్తి చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల: జిల్లాలో గుర్తించిన చెరువులు (వెట్‌ల్యాండ్స్) సంరక్షణ, అభివృద్ధికి సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్తో కలిసి అటవీ, రెవెన్యూ, నీటిపారుదల, మత్స్య, వ్యవసాయ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులతో చెరువుల సంరక్షణ, అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరువులు, వెట్‌ల్యాండ్స్ ప్రకృతి సమతుల్యతకు కీలకమని, భూగర్భ జలాల పెరుగుదలతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడతాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 164 చెరువులను గుర్తించినట్లు వెల్లడించారు.

గుర్తించిన ప్రతి చెరువు హద్దులు, పూర్తి విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్‌ వివరాలను రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, అటవీ, నీటిపారుదల తదితర శాఖల సమన్వయంతో సర్వే చేసి మ్యాపింగ్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు
చెరువుల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను అటవీ శాఖకు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా జల వనరుల అభివృద్ధి, మరమ్మతు పనులను అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు తెలిపారు.

చెరువుల అభివృద్ధి ద్వారా వలస పక్షులు, స్థానిక పక్షులు, జంతువులకు ఆవాసం లభించడంతో పాటు పర్యాటక రంగం అభివృద్ధికి కూడా అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. చెరువులను భవిష్యత్తులో కబ్జాల నుంచి రక్షించేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని అన్నారు. మొక్కల పెంపకం, చేపల పెంపకం, పర్యాటక అభివృద్ధికి కూడా చెరువులు దోహదపడతాయని తెలిపారు.

భూముల రీ-సర్వేలో అన్ని శాఖలు భాగస్వాములు కావాలి:
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీ-సర్వేలో అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సర్వే కొనసాగుతోందని తెలిపారు.

అటవీ, నీటిపారుదల, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు తమ శాఖలకు చెందిన భూముల వివరాలను సర్వే అధికారులకు అందించి, సర్వే ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు. దీంతో ఆయా శాఖలకు చెందిన భూముల వివరాలు పక్కాగా నమోదు అవుతాయని తెలిపారు.

ప్రస్తుతం సర్వే కొనసాగుతున్న గ్రామాల్లో రైతులు తప్పనిసరిగా పాల్గొనేలా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.

సమావేశంలో ఆర్డీఓలు శ్రీధర్ బాబు, కే.ఎస్.బీ. కుమారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, నీటిపారుదల శాఖ అధికారి ప్రశాంత్ కుమార్తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular