* పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
* 22ఏ జాబితాలో చేర్చే ప్రతి భూమికి స్పష్టమైన ఆధారాలు ఉండాలి
* నిజమైన ప్రైవేట్ భూముల సమస్యలను 48 గంటల్లో పరిష్కరించాలి
* ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దు
* 22ఏ భూముల పరిశీలన, తొలగింపునకు జిల్లావ్యాప్తంగా ఒకే ఫార్మాట్ రూపొందించాలి
* 22ఏ జాబితాపై రెవెన్యూ అధికారులతో సమీక్షించిన కలెక్టర్
పెద్దపల్లి : 22ఏ నిషేధిత భూములకు సంబంధించిన వ్యవహారాల్లో పూర్తి ఆధారాలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో కలిసి 22ఏ నిషేధిత భూముల జాబితాపై రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా 22ఏ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వస్తున్న ఫిర్యాదులు, భూముల రికార్డుల పరిశీలన, జాబితాలో చేర్చడం, తొలగింపు ప్రక్రియ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఏదైనా ప్రైవేట్ భూమి పొరపాటున 22ఏ నిషేధిత జాబితాలో నమోదైనట్లు నిర్ధారణ అయితే, సర్వే నంబర్ వారీగా డిలీటెడ్ లిస్ట్ రూపొందించి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ తెలిపారు.
22ఏ జాబితాలో భూములను చేర్చే సమయంలో అనుసరించే విధానాన్నే తొలగింపు ప్రక్రియలోనూ పాటించాలని సూచించారు. తొలగించే ప్రతి సర్వే నంబర్‌కు నిర్దిష్ట కారణాలు, స్పష్టమైన రిమార్క్స్ తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 22ఏ సమస్యలను పారదర్శకంగా, వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు.
22ఏ భూములకు సంబంధించిన ఫిర్యాదులపై అధికారులు సమన్వయంతో పనిచేసి, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ గంగయ్య, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

