* క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి: ఎంఈఓ జింక మల్లేష్
రామగుండం: 70వ ఎస్జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) రామగుండం తూర్పు మండల స్థాయి బాలుర కబడ్డీ, వాలీబాల్, ఖో-ఖో, అథ్లెటిక్స్ క్రీడలను మండల విద్యాధికారి జింక మల్లేష్ ప్రారంభించారు. జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో ఈ క్రీడా పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జింక మల్లేష్ మాట్లాడుతూ, క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. క్రీడల ద్వారా స్నేహభావం, సోదరభావం పెంపొందుతాయని, తద్వారా మంచి సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని, ఇందులో భాగంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించిందని తెలిపారు. ప్రతి పౌరుడు క్రీడలపై అవగాహన పెంచుకుని, సమాజంలో క్రీడా సంస్కృతిని మరింతగా అభివృద్ధి చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఎస్జీఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ మాట్లాడుతూ, రామగుండం మండలం విస్తీర్ణం, విద్యార్థుల సంఖ్య పరంగా పెద్ద మండలం కావడంతో తూర్పు, పశ్చిమ మండలాలుగా విభజించినట్లు తెలిపారు. రామగుండం తూర్పు మండల స్థాయి పోటీల్లో సుమారు 500 మంది క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమన్నారు.
క్రీడాకారులు మండల స్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి రామగుండం మండలానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి క్రీడా కోటా ద్వారా విద్య, ఉద్యోగ రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెద్దపల్లి జిల్లా నోడల్ ఆఫీసర్ తుల శోభారాణి, మండల కన్వీనర్ రామ, ఫిజికల్ డైరెక్టర్లు తిరుపతి, చందు, రమ్యాదేవి తదితరులు పాల్గొన్నారు.

