Monday, June 22, 2026

Buy now

రైతు భరోసా నిధులకు కీలక నిర్ణయం

వానాకాలం పంటలకు రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్వర్యంలో జరిగిన మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నాం.

ఈ నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా మధిరలో భారీ ఎత్తున రైతుల సమ్మేళనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రైతులతో ఆరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. అదే వేదిక నుంచి రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని ఈ సమావేశం నిర్ణయించింది. అదే వేదిక పై నుంచి రైతు భరోసా నిధులను రాష్ట్రంలోని రైతుల ఖాతాలో జమ చేయటం ప్రారంభమవుతుంది.
రైతులు పండించే సన్న దాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే బోనస్ ఏడు రకాల సన్నాలకు మాత్రమే ఇవ్వాలని ఈరోజు మంత్రుల సమావేశం నిర్ణయం తీసుకుంది.

మార్కెట్లో ఆ వెరైటీలకు ఉన్న డిమాండ్, ప్రజల అవసరాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్-15048, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం-1638, డబ్ల్యూజీఎల్-44, కేఎన్‌ఎం-7715… ఈ ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్ వర్తిస్తుంది.

రాష్ట్రంలోని మన రైతులు ఈ ఏడాది దేశంలోనే రికార్డు స్థాయిలో అత్యధిక ధాన్యం పండించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఇప్పటికే దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది.
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం నుంచి తక్కువ ధాన్యాన్ని సేకరించటంపై మంత్రుల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం.

కేంద్రం నిర్ణయించిన విధి విధానాల ప్రకారం రాష్ట్రంలోనూ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా పంట ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్రం నిర్దేశించిన కోటాను అనుసరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇకపై కేంద్రం ఏయే పంట ఉత్పత్తులకు MSP నిర్ణయించి, కొనుగోలు చేస్తుందో.. ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం

వానాకాలం సీజన్ కు రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులు ఇబ్బంది పడకుండా ఎరువుల కోటాను విడుదల చేయాలని ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు లేఖలు రాశారు. కేంద్రం వెంటనే ఎరువుల కోటాను విడుదల చేయాలని త్వరలోనే ఢిల్లీకి వెళ్లి మరోసారి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించాం.
మన రాష్ట్రంలో ఉన్న రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కంపెనీ లో ఉత్పత్తి అవుతున్న యూరియాలో అత్యధిక కోటా మన రాష్ట్రానికే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం.

ఇక్కడి నుంచి ఏ మధ్యప్రదేశ్ కో, బీహార్ కో పంపించకుండా మన రాష్ట్రానికే ఇక్కడి యూరియాను కేటాయిస్తే రవాణా ఖర్చులు కూడా తగ్గిపోతాయి. ఎరువుల కొరత సమస్య కూడా ఉత్పన్నం కాదు. ఇదే విషయాన్ని మరోసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన రైతుల తరఫున ఒత్తిడి పెంచాలని నిర్ణయం తీసుకున్నాం.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి కొత్తగా కేంద్రం తెచ్చిన వీబీజీ రామ్ జీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. పాత ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. కొత్త చట్టం అమలుతో కూలీలపైనా, రాష్ర్త ప్రభుత్వంపై పడే ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలించేందుకు కేబినేట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వివేక్ వెంకటస్వామి అధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.

మెట్రో విస్తరణకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఐఆర్ ఎఫ్సీ నుంచి ఒప్పందం ప్రకారం రావాల్సిన రుణాన్ని వెంటనే మంజూరు చేయించాలని కోరుతున్నాం. హైదరాబాద్ ట్రాఫిక్, ప్రయాణికుల అవసరాల దృష్ట్యా మెట్రో ఫేజ్ 2 విస్తరణ అత్యంత కీలకం.

అందుకే మన రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలందరూ కూడా మెట్రో విస్తరణకు సహకరించాలని కోరుతున్నాం. రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించకుండా. కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు ఇప్పించేందుకు ఆ పార్టీ నేతలు కలిసిరావాలని కోరుతున్నాం.

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను పేపర్ లెస్ గా నిర్వహించే పద్ధతికి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినేట్ సమావేశాలన్నింటినీ ఇకపై తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ గా నిర్వహిస్తారు. ఈ రోజు ఐటీ విభాగం తరఫున మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు అందరికి స్పెషల్ ట్యాబ్ లు అందజేశారు.

డిజిటల్ క్యాబినెట్ అమలు తీరును కూడా అందరూ స్వయంగా పరిశీలించారు. ఇకపై ఈ బుక్ ద్వారానే క్యాబినెట్ సమావేశం ఎజెండా.. నోట్స్ అన్నీ మంత్రులకు అందుబాటులో ఉంచుతారు. పేపర్ లెస్ గవర్నెన్స్ లో భాగంగా తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలియజేయటం ఆనందంగా ఉంది. ఇకపై కాగితాలతో పనిలేకుండా డిజిటల్ విధానంలో కేబినేట్ మీటింగ్ లు జరుగుతాయి.

ఈ నెల 21న దేశమంతటా నీట్ పరీక్ష జరుగనుంది. రాష్ట్రంలో దాదాపు 208 పరీక్ష కేంద్రాల్లో 2 లక్షల 95 వేల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకున్నాం. నీట్ పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్లు చూపించి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలి.

Related Articles

spot_img

Most Popular