*విద్యార్థుల భవిష్యత్తే.. రాష్ట్ర భవిష్యత్తు,
*పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సదుపాయాలు,
*27 లక్షల మంది విద్యార్థులకు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న మధ్యతరగతి, పేద కుటుంబాల పిల్లల ఆత్మగౌరవాన్ని పెంపొందించే లక్ష్యంతో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఎల్‌బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా , సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , ఇతర మంత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ… ఇది సాధారణ ప్రభుత్వ కార్యక్రమం కాదు. తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న మధ్యతరగతి, పేద కుటుంబాల పిల్లల ఆత్మగౌరవాన్ని బలోపేతం చేసే విశిష్ట కార్యక్రమం. వారు ఎవరికీ తక్కువ కాదనే భావనతో, సమాన అవకాశాలతో సగర్వంగా ఎదగాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆలోచించి దాదాపు 27 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన ఎడ్యుకేషన్ కిట్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ కిట్లలో బూట్లు, యూనిఫామ్‌లు, పుస్తకాలు, బెడ్‌షీట్లు తదితర అవసరమైన సామగ్రి అందిస్తున్నాం. కార్పొరేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తల్లిదండ్రులు అందించే సదుపాయాలతో సమానంగా ప్రభుత్వమే తల్లిదండ్రుల బాధ్యతను తీసుకుంటోంది. “మా పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు” అనే సంకల్పంతో ఇందిరమ్మ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందిన్నారు.
కేవలం కిట్ల పంపిణీకే పరిమితం కాకుండా, తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్ల వ్యయంతో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఒకేసారి మంజూరు చేసి నిర్మాణం చేపడున్నారు.
గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఇంత నాణ్యతతో కూడిన విద్యా సామగ్రిని అందించాలని ఆలోచించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వమే.
రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తెలంగాణ సమాజానికి ఈ కార్యక్రమం గొప్ప వరం. ఈ ప్రగతిశీల కార్యక్రమాలను అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించాలిన్నారు.

