Wednesday, June 24, 2026

Buy now

క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి.. విద్యార్థులకు అధికారుల పిలుపు

ఒలింపిక్ డే 2కే రన్‌లో కలెక్టర్, ఎస్పీ
కామారెడ్డి : ఒలింపిక్ విలువలు, క్రీడాస్ఫూర్తి, ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో కామారెడ్డి పట్టణంలో శనివారం నిర్వహించిన 40వ ఒలింపిక్ డే 2కే రన్-2026 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర పాల్గొన్నారు.

వివిధ శాఖల అధికారులు, క్రీడాకారులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అధికారులు జెండా ఊపి 2కే రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేస్తాయని పేర్కొన్నారు.

ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

విద్యార్థులు మొబైల్ ఫోన్లు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడాస్ఫూర్తితో వివిధ క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను చాటాలని కోరారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించి కామారెడ్డి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

తల్లిదండ్రులు తమ పిల్లల చదువుతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించాలని అధికారులు సూచించారు. క్రీడలు శారీరక, మానసిక వికాసంతో పాటు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్ ఎన్.వి. గిరి, కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కన్వీనర్ డా. కె.పీ. అనిల్ కుమార్, చైర్మన్ డా. ఎం. జైపాల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular