జనగామ:తెలంగాణ రాష్ట్ర మైనారిటీల స్టడీ సర్కిల్, హైదరాబాద్ ఆధ్వర్యంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నారు. టీజీపీఎస్సీ గ్రూప్స్-1, గ్రూప్స్-2, గ్రూప్స్-3, గ్రూప్స్-4, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, యూపీఎస్సీ తదితర పరీక్షలకు సంబంధించి నాలుగు నెలల బేసిక్ ఫౌండేషన్ కోర్సును నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
జనగామ జిల్లాలోని అర్హులైన మైనారిటీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిగ్రీ విద్యార్హత కలిగిన ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్శీ మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.అభ్యర్థులు అవసరమైన విద్యార్హత సర్టిఫికెట్లను జతచేసి తమ దరఖాస్తులను హైదరాబాద్‌లోని తెలంగాణ మైనారిటీల స్టడీ సర్కిల్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూన్ 20 నుంచి జూన్ 25 వరకు కొనసాగుతుందని, ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.మరిన్ని వివరాలకు 040-23236112, 9059050062 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని లేదా directormscccctelangana@gmail.com ఈమెయిల్ ద్వారా సమాచారం పొందవచ్చని అధికారులు తెలిపారు.

