Wednesday, June 24, 2026

Buy now

చేపల చెరువులు, ఉపాధి అవకాశాలపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి :జిల్లాలో మత్స్య రంగం ద్వారా రైతులు, మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయం కల్పించే దిశగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో అక్రమ చేపల చెరువులు, ఫిష్ కేజీల ఏర్పాటు, ఉపాధి అవకాశాలపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం జలాశయ విస్తీర్ణంలో కేవలం ఒక శాతం భూభాగాన్ని మాత్రమే ఫిష్ కేజీల ఏర్పాటుకు వినియోగించవచ్చని తెలిపారు. ఎల్లంపల్లి జలాశయంలో మొత్తం 120 ఫిష్ కేజీలను ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. ఒక్కో కేజీ పొడవు 7.5 మీటర్లు, లోతు 4 మీటర్లుగా ఉంటుందని, 12 కేజీలతో ఒక బ్యాటరీ, మొత్తం 10 బ్యాటరీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కేజీల్లో బ్లాక్ కెలాథియా చేపల పెంపకం చేపట్టనున్నట్లు తెలిపారు.ఒక్కో బ్యాటరీ ఏర్పాటుకు వాకింగ్ ట్రాక్‌తో కలిపి సుమారు రూ.28 లక్షల వ్యయం అవుతుందని తెలిపారు. 6 నుంచి 7 నెలల్లో చేపలు 600 నుంచి 700 గ్రాముల బరువుకు పెరుగుతాయని, ఒక్కో కేజీలో 2,500 చేప పిల్లలను వదిలితే 80 శాతం జీవన శాతంతో సుమారు 2 వేల చేపలు పెరుగుతాయని చెప్పారు. ఒక్కో కేజీ ద్వారా సుమారు రూ.30 వేల లాభం వచ్చే అవకాశం ఉందన్నారు.

ఫిష్ కేజీల నిర్వహణలో మండల స్థాయి మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతు సంఘాలను భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ సూచించారు. లబ్ధిదారుల్లో యాజమాన్య భావన పెంపొందేందుకు కనీసం 10 శాతం పెట్టుబడి వారివద్ద నుంచే ఉండేలా చూడాలని ఆదేశించారు. ఆసక్తి కలిగిన రైతులను గుర్తించి రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీఓ) ఏర్పాటు చేయాలని సూచించారు.

వ్యవసాయ భూముల్లో చేపల చెరువుల ఏర్పాటు కోసం సుమారు రూ.35 లక్షల పెట్టుబడి అవసరమవుతుందని, నిర్వహణ వ్యయం రూ.54 లక్షలు ఉంటుందని తెలిపారు. ఒక్కో కల్చర్‌కు 7 నుంచి 8 నెలల్లో సుమారు రూ.17 లక్షల లాభం వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న రైతులకు ఈ వివరాలు తెలియజేసి ముందుకు వచ్చే వారికి సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి రైతుకు సంవత్సరానికి కనీసం రూ.2 లక్షల అదనపు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
ఫార్మసీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన శిక్షణ, ఉపాధి అవకాశాలు, ఆర్థిక సహకారం అంశాలపై సమగ్ర అంచనాలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

టెలీ పెర్ఫార్మెన్స్, ఫాక్స్‌కాన్ సంస్థలు 500 మంది యువతకు ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నందున, ఐడీఓసీలో నిర్వహించనున్న జాబ్ మేళాను సమర్థవంతంగా నిర్వహించి ఎక్కువ మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉన్న కోర్సుల్లోనే యువతకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.

ప్రభుత్వ సహకారంతో ఉద్యోగాలు పొందిన యువత విజయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉపాధి కల్పన సేవల ద్వారా ఉద్యోగాలు పొందిన వారి విజయగాథలు ఎక్కువ మందికి చేరేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, తద్వారా మరింత మంది యువత ఈ సేవలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

జిల్లాలో ఉపాధి అవకాశాలపై యువతలో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో సింగరేణి జనరల్ మేనేజర్, జిల్లా మత్స్యశాఖ అధికారి పి. నరేష్ కుమార్ నాయుడు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కీర్తికాంత్, జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. రాజశేఖర్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్, టాస్క్ ఇన్‌చార్జ్ కౌసల్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular