Monday, August 24, 2026

Buy now

స్కాచ్ (SKOCH) అవార్డు అందుకున్న నెహ్రూ జూలాజికల్ పార్క్

వన్యప్రాణుల సంరక్షణ విభాగంలో దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి జూపార్క్‌గా రికార్డు
తెలంగాణ అటవీ శాఖకు మంత్రి కొండా సురేఖ అభినందనలు.

తెలంగాణ: అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణుల సంరక్షణలో తెలంగాణ అటవీ శాఖ చేపడుతున్న కృషికి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. మౌస్ డీర్ (Mouse Deer) సంరక్షణ, బ్రీడింగ్ మరియు అడవుల్లోకి పునరావాసం (Conservation Breeding & Reintroduction) కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసినందుకు నెహ్రూ జూలాజికల్ పార్క్ ప్రతిష్టాత్మక స్కాచ్ (SKOCH) అవార్డును అందుకుంది. వన్యప్రాణుల సంరక్షణ విభాగంలో ఈ అవార్డును అందుకున్న దేశంలోని తొలి జూపార్క్‌గా నెహ్రూ జూలాజికల్ పార్క్ నిలిచింది.

కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమలో భాగంగా అందించే ఈ అవార్డుల కార్యక్రమం న్యూఢిల్లీ లో జరిగింది.. నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ వసంత ఈ అవార్డును స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అటవీ దళాల అధిపతి (PCCF & HoFF) డా. సీ. సువర్ణ, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ వినయ్ కుమార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు అందించిన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం వల్లే ఈ ప్రతిష్టాత్మక అవార్డు సాధ్యమైందన్నారు. అలాగే మౌస్ డీర్ సంరక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన జూ సిబ్బంది, సాంకేతిక బృందం, సహచర ఉద్యోగుల కృషిని ఆమె అభినందించారు.

ఈ అవార్డు లభించడం పట్ల జూ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. నామినేషన్ ప్రక్రియలో సహకరించి, తమకు మద్దతుగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ జూ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.

ఈ సందర్భంగా చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ (PCCF) వినయ్ కుమార్ మాట్లాడుతూ, వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి వినూత్న సంరక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేస్తామని తెలిపారు.

ఈ అవార్డు సాధించిన నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులు, సిబ్బందితో పాటు తెలంగాణ అటవీ శాఖను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరెన్నో జాతీయ, అంతర్జాతీయ గుర్తింపులు సాధించాలని ఆకాంక్షించారు.

Related Articles

spot_img

Most Popular